సిటీబ్యూరో, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): దేశంలోనే రియల్ ఎస్టేట్ రంగానికి స్వర్గధామంలా నిలిచిన హైదరాబాద్ నగరం.. కాంగ్రెస్ చేతిలో విలవిలలాడిపోతున్నది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అభివృద్ధి పథంలో దూసుకుపోయిన నగరం.. రియల్ రంగంపై కాంగ్రెస్ బుల్డోజర్ పాలన శాపంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత పాలన విధానాలు, హైడ్రా పేరిట నగరంలో విధ్వంసం సిటీ రియాల్టీని కోలుకోలేని దెబ్బకొడుతూనే ఉన్నాయి. తాజాగా, నో బ్రోకర్.కామ్ అనే రియల్ ఎస్టేట్ అడ్వైజరీ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం 2026 మొదటి త్రైమాసికంలో దేశంలోని ప్రధాన నగరాలన్నింటి కంటే హైదరాబాద్‌లోనే రియల్ ఎస్టేట్ మార్కెట్ అత్యంత ఘోరంగా పడిపోయింది.
కొత్త ప్రాజెక్టుల లాంచింగ్‌లు ఎక్కడ?
హైదరాబాద్ అంటేనే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా భావించిన ఇన్వెస్టర్లు.. ఇప్పుడు నగరం వైపు చూడటానికే భయపడుతున్నారు. ప్రభుత్వం హైడ్రా పేరుతో ముందస్తు ప్రణాళిక లేకుండా చేపట్టిన కూల్చివేతలు మార్కెట్‌ను అభద్రతా భావానికి ఇప్పటికీ గురిచేస్తూనే ఉన్నాయి. అనుమతులు ఉన్నా… ప్రాజెక్టులను కూడా అనుమానపు నీడలోకి నెట్టడంతో కొత్త ప్రాజెక్టులు లాంచింగ్లూ భారీగా పడిపోయాయి. 2026 తొలి త్రైమాసికంలో కొత్త రెసిడెన్షియల్ లాంచ్‌లూ ఏకంగా రూ. 46శాతం క్షీణించడం గమనార్హం. మూడేళ్ల కిందట ఒక లెక్క, గడిచిన రెండున్నరేళ్లు ఒక లెక్క అన్నట్లు మార్కెట్లో కళకళలాడిన సైట్లు, వెంచర్లు, లాంచింగ్‌లతో నెలకొని ఉన్న హడావుడి కాస్తా కనుమరుగైపోయింది. ముఖ్యంగా ఈ ఏడాది మార్చి నెలలో ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా లాంచ్ కాలేదని నోబ్రోకర్. కామ్ నివేదికలో పేర్కొంది.
దూరమవుతున్న సొంతింటి కల
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కేవలం లగ్జరీ విభాగంలోనే కేంద్రీకృతం అవడంతో… సామాన్యుడి సొంతింటి కల దూరమైపోతున్నాయి. మార్కెట్లో నెలకొని ఉన్న ఆర్థిక ప్రతికూల పరిస్థితులు కూడా మధ్యతరగతి ప్రజలకు శాపంగా మారాయి. నగరంలో 80శాతం కంటే ఎక్కువ అపార్ట్మెంట్లూ 3బీహెచ్‌కే, అంతకంటే పెద్దవి కావడం, వాటి సగటు విస్తీర్ణం 2వేల చదరపు అడుగులపైనే ఉండటంతో ప్రస్తుతం ఉన్న ధరలతో సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లాయి. చదరపు అడుగు ధర సగటున రూ. 8వేలు ఉన్నా, కనీసం ఒక ప్లాట్ కొనాలంటే రూ. 1 కోటిపైనే ఉండటంతో… సామాన్యుడి సొంతింటి కల చెరిగిపోతుంది.
భరోసా కరువు..
బీఆర్ఎస్ హయాంలో ప్రపంచ నగరాల జాబితాలో పోటీపడిన హైదరాబాద్, నేడు కాంగ్రెస్ సర్కార్ పాలనలో తీసుకువచ్చిన నిర్ణయాలతో తిరోగమనంలో అభివృద్ధి సాగుతున్నది. ఈ ప్రభావం కేవలం ఒక్క రియల్ ఎస్టేట్ రంగంపై మాత్రమే పడలేదు. దీనిపై ఆధారపడి ఉన్న 25 రంగాలను తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీనికితోడు కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చిన హైడ్రా దెబ్బకు, చెరువుల శిఖం, బఫర్ జోన్ల పేరితో సామాన్యుల ఇండ్లపై బుల్డోజర్లు ఎక్కించడంతో మార్కెట్లో పెట్టుబడిదారులకు భరోసా కరువైంది. బిల్డర్లు కూడా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టాలంటేనే వణికిపోతున్నారు. అక్రమ నిర్మాణాలు అరికట్టడం మంచిదే, కానీ అనుమతులు ఉన్న ప్రాజెక్టులను అక్రమాలుగా తేల్చి నేలమట్టం చేయడం ఇప్పుడు సమస్యగా మారింది. ఇక అనుమతులు ఇచ్చిన అధికారులను విడిచిపెట్టి, అప్పు చేసి కొనుగోలు చేసిన ఇండ్లను నేలమట్టం చేయడంతో కొనుగోలుదారులు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు.
రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడంతో దానిపై ఆధారపడిన వందలాది అనుబంధ రంగాలు, వేలాది మంది కార్మికులు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. ఏటా తగ్గుతున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆధాయంతోపాటు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ వంటి పట్టణ ప్రణాళిక సంస్థలకు వస్తున్న ఆదాయం నగరంలో పడిపోయిన రియల్ ఎస్టేట్‌కు రంగానికి తేటతెల్లం చేస్తున్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా వచ్చేది. ఈ అవకాశం లేకపోవడంతోనే సర్కారు కేవలం ఉన్న భూములను విక్రయిస్తున్నది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోని, రియల్ రంగానికి భరోసానిచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌తోపాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై బుల్డోజర్ ప్రభావం పడుతుందని రియల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.