దళితబంధు ప్రారంభంతో దళితవాడల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆడబిడ్డలు అభిమానం చాటారు. తెలిపారు. తమ ఇండ్ల ముందు వాకిళ్లను రంగురంగుల రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. ‘దళితబంధు’ ‘జై తెలంగాణ’ ‘జై కేసీఆర్’ ఆకృతి వచ్చేలా ముగ్గులు వేశారు. ఇంటి ముందు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టారు. తమ కాలనీలను కూడా అలంకరించుకొని, దళిత బంధుకు స్వాగతం పలికారు. ఇంట్లో దేవుడికి కొబ్బరి కాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. పిల్లాజెల్లను సిద్ధం చేసి, సభకు సంబురంగా వెళ్లారు.
రైతుబంధుకు శ్రీకారం చుట్టిన నేల నుంచే బృహత్తర పథకానికి అంకురార్పణ స్వతంత్ర భారతావనిలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. దశాబ్దాలుగా అంధకారంలో మగ్గిన అణగారిన వర్గాల్లో వెలుగులు నింపే చారిత్రక ఘట్టానికి మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా బీజం పడింది. ఉద్యమాల గడ్డ హుజూరాబాద్ కేంద్రంగా విప్లవాత్మక ‘దళితబంధు’ పురుడుపోసుకున్నది. దగాపడ్డ జీవితాలకు కొత్త వెలుగును తెచ్చింది. ‘రైతు బంధు’కు శ్రీకారం చుట్టిన నేల శాలపల్లి-ఇందిరానగర్ నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి సోమవారం అంకురార్పణ చేయగా, నియోజకవర్గం నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి దళిత దండు ఉప్పెనలా తరలివచ్చింది. అడుగడుగునా దండోరా మోగించింది. “దళితజాతికి దార్శనికుడు.. అభినవ అంబేద్కరుడు.. మా కేసీఆర్” అంటూ జేజేలు పలికింది. ‘జై భీమ్’ ‘జై దళితబంధు’ ‘జై హింద్’ అంటూ కేసీఆర్ నినదించగా, చప్పట్లతో హోరెత్తించింది. దళితబాంధవుడు తమ భవిష్యత్‌కు ఇచ్చిన భరోసాతో సంతోషంగా వెనుదిరిగింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత 15 మంది దళితులకు మంజూరు పత్రాలతో పాటు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు ఏ పనులు నిర్వహించనున్నారో వేదికపైనే లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే ఈ చేయూత ఆర్థికాభివృద్ధి సాధించాలని, పేద కుటుంబాల్లో వెలుగులు నిండాలని సూచించారు.