సైదాబాద్, సెప్టెంబర్ 1: పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను నిలదీయడంతో.. పథకం ప్రకారం భార్యకు కల్లు తాగించి హత్య చేశాడు. ఈ ఘటన శనివారం రాత్రి సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని ఘాన్సీరాం తండాకు చెందిన కిషన్ (50), దస్లీ (45) దంపతులు. వీరికి ముగ్గురు సంతానం.
ఇద్దరు కూతుళ్లు. ఒక కుమారుడు. ఇద్దరు కూతుళ్ల పెండ్లీలయ్యాయి. జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణికాలనీ గుడిసెల్లో ఉంటున్నారు. కిషన్ ఆటో డ్రైవర్. దస్లీ కూలీ. శనివారం ఆటో నడపడానికి వెళ్లిన కిషన్.. తాటి కల్లు తేవడంతో ఇద్దరు కలిసి తాగారు. అనంతరం కిషన్‌కు మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధంపై భార్య ప్రశ్నించి నిలదీసింది. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు.
దస్లీ కల్లు తాగిన మత్తులో నిద్రలోకి జారుకోగానే.. ఆమె ముఖంపై దిండు పెట్టి అదిమిపట్టి పథకం ప్రకారం హత్య చేశాడు. ఇంటి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న కిషన్‌ను చూసిన స్థానికులు నిలదీయడంతో అక్కడి నుంచి పరుగు పెట్టాడు. అనుమానంతో స్థానికులు వెంబడించి పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం సైదాబాద్ పోలీసులకు సమాచారమిచ్చి అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కిషన్‌ను అరెస్టు చేసినట్టు కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై సాయికృష్ణ తెలిపారు.