Husband Suicide | బంజారాహిల్స్, మార్చి 19 : ‘నా భార్య పెట్టే వేధింపులు భరించడం ఇక నావల్ల కాదు..’ ‘ఇలాంటి జీవితం నేను కోరుకోలేదు..స ‘గుండాల సాయంతో ఏదో ఒక రోజు నన్ను చంపించడం ఖాయం..’ ‘చీటికిమాటికి పోలీసులకు ఫోన్ చేసి జైలుకు పంపిస్తా అంటూ బెదిరిస్తోంది.’ మీరంతా జాగ్రత్త…అంటూ తల్లికి ఫోన్ కాల్ చేసిన ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం బుదిమి గ్రామానికి చెందిన మహమ్మద్ నవాజ్ (35) సినీ పరిశ్రమలో కెమెరామెన్‌గా పనిచేస్తుంటాడు. 2020లో నవాజ్ జీడిమెట్ల ప్రాంతానికి చెందిన శ్వేతా రెడ్డి అనే యువతీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొన్నాళ్లు బాగానే ఉన్న వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో భర్త నవాజ్ మీద భార్య శ్వేతా రెడ్డి కరీంనగర్, బాలానగర్, బాన్సువాడ పోలీస్ స్టేషన్లలో వేధింపుల కేసులు పెట్టింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో వారిద్దరూ కలిసి కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 16న సాయంత్రం తన తల్లి సాబెరా బేగంకు ఫోన్ కాల్ చేసిన నవాజ్ తీవ్రంగా ఏడుస్తూ తన భార్య పెట్టే వేధింపుల గురించి ఏకరువు పెట్టాడు. సొంతూరులో ఉన్న రూ. 30 లక్షల విలువైన ఆస్తిని తన పేరుతో రాయాలంటూ టార్చర్ పెడుతుందని.. స్థానికంగా ఉండే రౌడీలతో తనను కొట్టించడంతో పాటు తిండి పెట్టకుండా రోజుల పాటు ఆకలితో ఉండేలా చేస్తుంది అని.. ఎప్పుడు పడితే అప్పుడు పోలీసులకు ఫోన్ చేసి జైల్లో వేయిస్తా అంటూ బెదిరిస్తోంది అని.. తనకు ఇలాంటి జీవితం అవసరం లేదు, ఏదో ఒకరోజు తాను భార్య చేతిలో చావడం ఖాయం అంటూ .. తనకు ఆత్మహత్య చేసుకోవడం మినహా మరో మార్గం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లికి కాల్ చేసిన తర్వాత అదేరోజు రాత్రి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి మరుసటి రోజు ఉదయం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడలి వేధింపుల వల్లనే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు బీఎన్ఎస్ 194 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.