ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 17: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సమగ్ర కులగణన చేపట్టి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (టీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఓయూ వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని చెప్పారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే బీసీలను అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. దీనికి తోడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కారణంగా బీసీలే తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే సమగ్ర కులగణన చేపట్టి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను పూర్తిగా అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో ఆర్ట్స్ కళాశాల వేదికగా ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని, మరో తెలంగాణ ఉద్యమం వంటి ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీలను వంచించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పోరుకు అన్ని ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీ నాయకులు నూకల మధుయాదవ్, పవన్‌వర్మ, థెరిస్సా, మహేశ్‌గౌడ్, శ్రీకాంత్, కిరణ్, నరేశ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.