హిమాయత్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోస పూరిత వైఖరిని అవలంభించడాన్ని నిరసిస్తూ ఈ నెల 27న ఇందిరాపార్క్ వద్ద గల ధర్నాచౌక్‌లో ఆటో కార్మికుల ‘ఆకలి కేక’ల సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యూనైటెడ్ ఆటో ఒనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవి కుమార్, బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, రాష్ట్ర ఆటో జేఏసీ చైర్మన్ గాజుల ముఖేశ్ గౌడ్ తెలిపారు.
ఆదివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్ లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లకు గిరాకీలు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. ఆటో కార్మికుల సమస్య లను పరిష్కారిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చల పేరుతో కాలయాపన చేస్తు న్నారని మండిపడ్డారు.
సమస్యలను పరిష్కరించాలని కోరితే పొన్నం ప్రభాకర్ దాట వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆటో డ్రైవర్లకు ఇది జీవన్మరణ పోరాటమని, లాటీలు, తుటాలు తగిలినా వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరుతూ గత నెల 27న ఆటో రథయాత్ర చేపట్టి వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి జరుగుతున్న అన్యాయంపై ఆటో డ్రైవర్లకు తెలియజేశామన్నారు. సమావేశంలో బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహమద్ హబిబ్, ఏఐటీయూసీ నేత వెంకటేశ్వర్లు, టీయూసీఐ నేతలు ప్రవీణ్, లింగన్న గౌడ్ పాల్గొన్నారు.