మేడ్చల్, జూలై 30 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరిలో జిల్లాలోని ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాల వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో ఆక్రమణలపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కబ్జాలను గుర్తించే పనిలో పడ్డారు. ముఖ్యంగా మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినట్లు ప్రజావాణిలో ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల మ్యాప్‌లను పరిశీలించి వాటి హద్దులను గుర్తించడంతో పాటు హద్దులోపల ఉన్న నిర్మాణాల వివరాలను నమోదు చేసుకుని తదుపరి చర్యలకు యంత్రాంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
వందల కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా..!
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ మండలం 12, 13, 49, 79, 91, 97, 204, 307, 329, 340, 342, 348 సర్వే నంబర్లలోని ప్రభత్వ భూమి వంద ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది. ఇక్కడి భూములు మార్కెట్లో ప్రస్తుతం ఎకరా రూ.10 కోట్ల వరకు పలుకుతున్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్‌లో 1 నుంచి 1,200 వరకు ఉన్న సర్వే నంబర్లలోనివి అన్నీ ప్రభుత్వ భూములే.
ఈ నంబర్లలో సుమారు 6 వేల ఎకరాల వరకు ఉండగా ఇందులో ఎంతవరకు కబ్జాకు గురైందని తేల్చిన అధికారులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో 63/1 నుంచి 63/27 సర్వే నంబర్లలో కబ్జాలు అయ్యాయి. మల్కాజిగిరి నియోజకవర్గం అల్వాల్ జొన్నబండ 22, 23 సర్వే నంబర్ల ప్రభుత్వ భూమితో మల్కాజిగిరి గౌతంనగర్‌లో 844 సర్వే నంబర్లో సుమారు 55 ఎకరాల స్థలం కబ్జాలకు గురువుతున్న విషయమై స్థానికులు జిల్లా కలెక్టర్ మను చౌదరి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ప్రజావేదికలో సైతం పలుమార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
అధికారుల సమన్వయ లోపం..
రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమన్వయలోపంతోనే జిల్లాలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయనే విమర్శలున్నాయి. ప్రభుత్వ భూముల కబ్జాలపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఇది రెవెన్యూ అధికారులు చూస్తారని మున్సిపల్ అధికారులు తప్పించుకోగా.. రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేస్తే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొంటున్నట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తన్నారు. వాస్తవానికి ప్రభుత్వ భూముల వివరాలు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఉన్నాయని, వెంటనే ఆయా భూముల్లోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదులు అందటంతో.. ఎట్టకేలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం.
త్వరలో చర్యలు..
ప్రభుత్వ భూములలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. సర్వే నంబర్ల వారీగా మరోసారి హద్దులను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు ఆ పనిలో బిజీగా ఉన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా ఇప్పటికే వందలాది ఎకరాలు కబ్జాలకు గురైన విషయం తెలిసిందే. అయితే అక్రమ నిర్మాణాలు చేపట్టిన తర్వాత ఇంటి నెంబర్లను మున్సిపల్ అధికారులు మమూళ్లు తీసుకుని ఇవ్వడం వల్ల వాటిపై చర్యలు తీసుకునేందుకు సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.