Hyderabad Rains | హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. ఇప్పుడిప్పుడే వాన తెరిపి ఇవ్వడంతో పాటు ఆఫీసులు ముగియడంతో వాహనాలన్నీ ఒక్కొక్కటిగా రహదారులపైకి వచ్చాయి. దీంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ వాహనాల రద్దీతో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు చేరడంతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, ఐకియా, విప్రో జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్డు నంబర్ 45, బేగంపేట, పంజాగుట్ట సహా పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. మాదాపూర్ నుంచి కేపీహెచ్‌బీ వైపు వెళ్లే మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మాదాపూర్ నెక్టార్ గార్డెన్, శిల్పారామం సైబర్ గేట్ వే రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది.
భారీ వర్షం కారణంగా బంజారాహిల్స్‌లో రోడ్డు నంబర్ 9లో నాలాపైకి రోడ్డు కుంగిపోయింది. నాలాపై రోడ్డు కుంగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 11లో నాలా పైకప్పు కూలింది. నాలా కూలడంతో వరద నీటిలో ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. బల్కంపేటలో రైల్వే అండర్‌పాస్ కింద వరద నీటిలో కారు మునిగిపోయింది.
మలక్‌పేట రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. రైల్వే అండర్‌పాస్ కిందకు నీరు చేరడంతో దిల్సుఖ్నగర్ – కోఠి మార్గంలో ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. కోఠి, చాదర్‌ఘాట్, మలక్‌పేట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని స్టీల్ బ్రిడ్జిపై వరద నీరు నిలిచిపోయింది. పంజాగుట్ట, బేగంపేట వద్ద రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిని తొలగించేందుకు డీఆర్ఎఫ్ బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో నగర మేయర్ కూడా అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని, నేలకొరిగిన వృక్షాలను తొలగించాలని ఆదేశించారు. రాత్రి 7 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండి, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. డీఆర్ఎఫ్ బృందాల చర్యల కోసం 040-21111111 లేదా 9000113667 నంబర్లను సంప్రదించొచ్చు అని తెలిపారు.