Hyderabad | ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో రహదారి మధ్యలోనే కారు ఆగిపోయింది.
కారులో నుంచి మంటలు రావడంతో కంగారుపడిపోయిన ప్రయాణికులు హుటాహుటిన బయటకు వచ్చేశారు. దీంతో వారు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. కాగా, ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. నడిరోడ్డుపై కారు కాలిపోవడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పల్ నుంచి తార్నాక వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
మరోవైపు సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద ఉన్న ఎస్బీఐ భవనంలోని నాలుగో అంతస్తులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో బ్యాంకుకు సంబంధించిన కీలక పత్రాలు మంటల్లో కాలిపోతున్నాయి. కాగా, ఫైర్ యాక్సిడెంట్ గురించి తెలియగానే హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.