బంజారాహిల్స్, నవంబర్ 10: జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్లో గ్యాస్ లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి హోటల్‌కు చెందిన కిచెన్ భవనం కుప్పకూలడంతో పాటు శిథిలాలు గాల్లోకి ఎగిరి సుమారు 100 మీటర్ల దాకా పడటంతో సమీపంలో ఉన్న బస్తీలోని పలు గుడిసెలు ధ్వంసమవ్వగా, ఓ మహిళ గాయపడింది. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నం.1లోని తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్‌లోని కిచెన్‌లో ఆదివారం తెల్లవారుజామున 4.30 సమయంలో భారీ పేలుడు సంభవించడంతో కిచెన్ మొత్తం కుప్పకూలింది. కిచెన్‌కు ఒకవైపు రెస్టారెంట్ భవనం ఉండగా, రెండోవైపు ఖాళీ స్థలాన్ని ఆనుకుని కింది భాగంలో రోడ్ నం.5లోని దుర్గాభవానీనగర్ బస్తీ ఉంది.
పేలుడు ధాటికి కిచెన్‌లోని వంట సామగ్రితో పాటు గోడలు, కిటికీలు, తలుపులు, కరెంట్ స్తంభాలు గాల్లోకి లేచి పక్కనున్న బస్తీలోని గుడిసెలపై పడ్డాయి. పక్కనున్న చెట్లు విరగడంతో పాటు కరెంట్ వైర్లు తెగిపడటంతో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. బాంబులు పేలాయా.. ఇండ్లలో గ్యాస్ సిలిండర్లు పేలాయో అర్థంకాని పరిస్థితిలో నిద్ర లేచిన స్థానికులు.. తమ పిల్లలను తీసుకుని బయటకు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో బస్తీకి చెందిన ఇస్లావత్ పూజ అనే మహిళ తన పిల్లలను కాపాడే క్రమంలో తలకు, మోచేతికి గాయాలయ్యాయి. బస్తీవాసులు బయటకు వచ్చి చూడగా చెల్లాచెదురుగా పడి ఉన్న చెట్లు, కరెంట్ వైర్లు, ఎగువభాగం నుంచి గాల్లోకి ఎగురుకుంటూ వచ్చి పడ్డ సిమెంట్ బ్రిక్స్‌తో భీతావహ వాతావరణం నెలకొంది. పేలుడు తర్వాత కొన్ని క్షణాలు తెలంగాణ స్పైసీ హోటల్ కిచెన్‌లో మంటలు చెలరేగాయి.
గాయపడిన పూజను స్థానికంగా ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. కాగా, జూబ్లీహిల్స్ పోలీసులు,ఫైర్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కిచెన్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్లను బయటకు తరలించారు. కిచెన్ బయట ఉన్న సిలిండర్ల నుంచి కిచెన్‌లోని స్టవ్‌లకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని,.వాటిని సరిగా మూసేయకపోవడంతో పాటు గ్యాస్ లీక్ కావడంతో పేలిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా పేలుడు సంభవించిన సమయంలో కిచెన్‌లో సిబ్బంది లేకపోవడం, చలికాలం కావడంతో బస్తీలోని రోడ్డుపై జన సంచారం లేకపోవడంతో పెను ముప్పు తప్పిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, డీఐ మధుసూదన్‌తో పాటు క్లూస్ టీం, బాంబ్ స్కాడ్ బృందాలు చేరుకుని ఆధారాలు సేకరించాయి.