జీడిమెట్ల, జూన్ 3 : తిరుపతి నుంచి హైదరాబాద్ కొకైన్, ఇపిడ్రైన్ మత్తు పదార్థాన్ని తీసుకువచ్చి అమ్మేందుకు ప్రయత్నించిన ఐదుగురిని బాలానగర్ ఎస్ఓటీ , కూకట్పల్లి పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ప్రధాన నిందితుడు గుణశేఖర్ పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి పోలీసులు కోటి రూపాయల విలువజేసే 820 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం షాపూర్‌నగర్‌లోని డీసీపీ కార్యాలయంలో ఇన్చార్జి డీసీపీ ఎన్.కోటిరెడ్డి, ఎస్ఓటీ డీసీపీ డి.శ్రీనివాస్, బాలానగర్ జోన్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. డీసీపీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… తిరుపతికి చెందిన గుణశేఖర్ ఏపీలో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గుణ శేఖర్ తిరుపతికి చెందిన అతడి స్నేహితుడు ఉన్నం సురేంద్ర(31)కు అత్యాశ చూసి మే 29వ తేదీన 820 గ్రాముల కొకైన్ (మత్తు పదార్థాన్ని) ఇచ్చి హైదరాబాద్ లో అమ్మాలని అప్పగించాడు.
ఆశాపరుడైన సురేంద్ర గుణశేఖర్ చెప్పినట్లుగానే కొకైన్ తీసుకుని గుంటూరు గుండా హైదరాబాద్ కూకట్పల్లి చేరుకున్నాడు. హైదరాబాద్‌లో సురేంద్ర తన మనుషులైన బాపట్ల జిల్లాకు చెందిన దోతిరెడ్డి హరిబాబురెడ్డి(38), దేవరాజు యేసుబాబు(29)లను హైదరాబాద్ రప్పించుకున్నాడు. అదే విధంగా సురేంద్రచే గూడి మెర్సి మార్గరెట్(34), షేక్ మస్తాన్ వలీ(40)లను సైతం పిలిపించుకున్నాడు. అందరూ కలిసి కూకట్‌పల్లిలోని జయనగర్‌లో కలుసుకున్నారు.
వీరంతా కలిసి జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు పోలీసులు బీజీగా ఉంటారని, ఆ రోజే అమ్మేందుకు పథకం వేశారు. వారు అనుకున్నట్లుగా కొకైన్ డిమాండ్ ఉన్న చోట యేసుబాబు ద్వారా అమ్మాలని భావించారు. వీరంతా కలిసి జూన్ 2వ తేదీన కూకట్పల్లి భాగ్యనగర్ వైపు వెళ్తుండగా.. అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా.. వారి వద్ద కొకైన్ లభించింది. వెంటనే ఐదుగురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అసలు కొకైన్ వీరికి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం ప్రధాన నిందితుడు గుణశేఖర్ పోలీసులకు పట్టుబడితే అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ రవికుమార్, కూకట్పల్లి ఇన్స్పెక్టర్ రాజేష్, బాలానగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శివ కుమార్, ఎస్సైలు కట్కం గౌతం ఉన్నారు.
తమ పిల్లలు బయట ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారో పిల్లల తల్లిదండ్రులు గమనించాలని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. అదే విధంగా పిల్లలపైన అనుమానం వస్తే వారి కదలికలను గమనించి పోలీసులకు తెలిపాలని కోరారు. మీ ప్రాంతాల్లో యువత ఏదైనా డ్రగ్స్, గంజాయి లాంటివి సేవిస్తున్నారని తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.