కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 6 : కేపీహెచ్‌బీకాలనీలో హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మడానికి గృహ నిర్మాణ మండలి అధికారులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. హౌసింగ్ బోర్డ్ ఖాళీ స్థలాలను గుర్తించడం, వాటి పరిరక్షణ కోసం ప్రహరీలను నిర్మించడంతో పాటుగా ఆ ఖాళీ స్థలాలను విక్రయించే చర్యలను ప్రారంభించింది. కానీ హౌసింగ్ బోర్డు చేస్తున్న చిన్న తప్పిదాల కారణంగా.. బహిరంగంగా వేలంపాట పెట్టిన విలువైన స్థలాలను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
ఇటీవల హౌసింగ్ బోర్డు వెస్ట్రన్ డివిజన్ (కేపీహెచ్‌బీకాలనీ)పరిధిలో 24 ప్లాట్లను విక్రయించేందుకు వేలం పాటను పెట్టగా… ఒక ప్లాటు కోర్టు కేసుతో ఆగిపోగా మిగిలిన 23 ప్లాట్ లకు వేలంపాటలు నిర్వహించారు. ఇందులో 12 ప్లాట్లను కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకు రాగా… చివరకు ముగ్గురు మాత్రమే ప్లాట్లను కొనుగోలు చేశారు.
రాష్ట్ర గృహ నిర్మాణ మండలి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేపీహెచ్‌బీకాలనీ 9,15 పేజ్ లలోని గుర్తించిన 18 ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి గలవారు ఈనెల 11న కేపీహెబీకాలనీ1,2 పేజ్ లలోని హౌసింగ్ బోర్డ్ కమ్యూనిటీ హాల్ లో జరిగే వేలంపాటకు హాజరుకావాలని కోరుతున్నారు. కైలాపూర్లోని ప్లాటుకు 1 చదరపు గజం ధర రూ. 80 వేలుగా.. 7వ పేజ్ లోని నివాసం ప్లాట్లకు చదరపు గజం ధర రూ.1.25 లక్షలుగా వాణిజ్యం ప్లాట్ కు చదరపు గజం ధర రూ. 1.50 లక్షలుగా నిర్ణయించారు. దీనికిగాను కైతలాపూర్ ప్లాటుకు రూ. 5 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్ (బయానా), కాలనీ 7వ పేజ్ ప్లాట్లకు రూ.10 లక్షల డిమాండ్ డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)తో వేలంపాట జరిగే రోజున ఉదయం 9.30 గంటల నుంచి 11 వరకు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
ఈసారి అమ్మకానికి పెట్టిన ఖాళీ స్థలాలన్నీ హాట్ కేక్ ల అమ్ముడుపోయేవే. కాలనీ ఏడో పేజ్ లోని వాణిజ్యం ప్లాట్ లని నిర్ణయించిన ధర కంటే రెట్టింపు ధర పలికిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ప్లాట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి గలవారు, స్థానిక ప్రజలు క్షేత్రస్థాయిలో ప్లాట్లను పరిశీలించిన పిమ్మట అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు లేవనెత్తే పలు అనుమానాలను నివృత్తి చేస్తేనే హౌసింగ్ బోర్డు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు లేకుంటే మరోసారి నిరాశ తప్పదు.