అడ్డగోలు అక్రమ నిర్మాణాలతో కొందరు రెచ్చిపోతున్నారు..అప్రోచ్ రోడ్డు లేకుండానే హౌసింగ్ బోర్డు స్థలాన్ని చూపించి భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్న సదరు నిర్మాణదారుడికి టౌన్‌ప్లానింగ్ అనుమతులు ఇచ్చేసింది. స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ అక్రమ నిర్మాణ భాగోతంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. స్పందించిన హౌసింగ్ బోర్డు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అనుమతిని రద్దు చేయాలంటూ జీహెచ్ఎంసీని కోరింది. స్పందించిన టౌన్‌ప్లానింగ్ సదరు నిర్మాణ దారుడికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఏడు రోజుల్లోగా అప్రోచ్ రోడ్డుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది..జీహెచ్ఎంసీ జారీచేసిన నోటీసులకు ఏ మాత్రం భయపడకుండా సదరు నిర్మాణదారుడు పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
సిటీబ్యూరో, కేపీహెచ్‌బీ కాలనీ , జూన్ 3 (నమస్తే తెలంగాణ) : మూసాపేట సరిల్ బాలాజీ నగర్ డివిజన్లో ఓ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కోసం తప్పుడు పత్రాలతో అనుమతులు పొందాడని తెలిసిన జీహెచ్ఎంసీ యంత్రాంగం సదరు నిర్మాణంపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారు. కూకట్‌పల్లిలోని సర్వేనంబర్ 988 , 991లలో 12,848.76 స్వేర్ మీటర్ల విస్తీర్ణంలో కే పాండు అండ్ ఇతరుల పేరుతో రెసిడెన్షియల్ బిల్డింగ్‌ల నిర్మాణం కోసం బ్లాకులు..ఏ, బీ, సీ, డీ(నాలుగు బ్లాకులు)… ఒకొక బ్లాక్ సెల్లార్ ప్లస్ స్టీల్ట్ ప్లస్ 5 అంతస్తుల నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అనుమతులు పొందారు.
అనుమతి కోసం దరఖాస్తు చేసిన పత్రాల్లో దాని పకనే ఉన్న హౌసింగ్ బోర్డుకు చెందిన (సర్వే నంబర్ 939) స్థలంలో 40 ఫీట్ల రోడ్డును చూపించారు. పనులు కూడా ప్రారంభం కావడంతో అడ్డదారిలో అనుమతులు పొందిన తీరును ఎండగడుతూ ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. స్పందించిన హౌసింగ్ బోర్డ్ అధికారులు రంగంలోకి దిగి భవనాల పత్రాలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అనుమతి పొందిన ఆ భారీ భవనాల నిర్మాణంతో పాటు మరో నాలుగు అపార్ట్మెంట్ల నిర్మాణాలకు కూకట్పల్లి జోన్ కార్యాలయంలో అనుమతులు జారీ చేసినట్లు తెలుసుకున్నారు.
వెంటనే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి.. తప్పుడు పత్రాలతో భవన నిర్మాణ అనుమతులు పొందారాని, వారు చూపించిన దారి హౌసింగ్ బోర్డ్‌కు చెందిన స్థలం అని పూర్తి ఆధారాలతో పత్రాలను సమర్పించి… చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చేరడంతో ఉకిరిబికిరైన జీహెచ్ఎంసీ, హౌసింగ్ బోర్డ్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. తప్పుడు పత్రాలతో అనుమతులు పొందిన భవనాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి చేతులు దులుపుతున్నారు.
హౌసింగ్ బోర్డ్ స్థలాన్ని దారిగా చూపించి.. కూకట్పల్లి జోన్ కార్యాలయంలో అనుమతులు పొందిన కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించి స్టేను తీసుకొచ్చారు. కానీ ప్రధాన కార్యాలయంలో అనుమతులు పొందిన కే పాండు అనే నిర్మాణదారుడు కోర్టును కూడా ఆశ్రయించలేదు. జీహెచ్ఎంసీ జారీచేసిన నోటీసులకు భయపడకుండా నిర్మాణ పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. పోలీసు విభాగంలో ఉన్నతాధికారి పేరు, ఏపీలోని అధికార పార్టీకి చెందిన మంత్రుల పేర్లు, రాష్ట్రంలోని అధికార పార్టీ నేతల పేర్లు.. స్థానికంగా ప్రజాప్రతినిధుల పేర్లు చెబుతూ… నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు.
అనుమతులకు మించి ఒక ఫ్లోర్ ఎకువ కడితేనే హడావిడి చేసే అధికారులు తప్పుడు పత్రాలతో అనుమతులు పొందారని తెలిసిన ఆ భారీ భవన నిర్మాణాలకు చెందిన అనుమతులు రద్దు చేయడంలో మాత్రం వెనుకంజ వేస్తున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన జీహెచ్ఎంసీ కమిషనర్ వద్దకు ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు.. జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. అనుమతులు పొందినప్పటి నుంచి… తప్పుడు పత్రాలతో అనుమతులు పొందారని వచ్చిన ఫిర్యాదులను.. పకన పెట్టడంలో టౌన్ ప్లానింగ్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టినట్లు .. అందుకే పట్టించుకోవడంలేదని కిందిస్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులే చర్చించుకోవడం గమనార్హం.
ఇంతటి వ్యవహారం బహిరంగంగానే జరుగుతున్న జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయడంతో… ఈ భవనాల నిర్మాణం వెనుక పాత్రధారులు ఎవరు… సూత్రధారులు ఎవరు… అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతుంది. సామాన్యులను నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టే జీహెచ్ఎంసీ అధికారులు కళ్లముందే ఇంత వ్యవహారం నడుస్తున్న పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనిపై కమిషనర్ వెంటనే జోక్యం చేసుకొని సదరు నిర్మాణ అనుమతిని రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.