సిటీబ్యూరో, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ) : కేంద్రం మొండి చేయి చూపడంతో నగరంలో మెట్రో విస్తరణ ఆశలు గల్లంతు అవుతున్నాయి. 10నెలలు గడిచిన డీపీఆర్లను ఆమోదించకపోవడంతో మెట్రో సంస్థ ఫేజ్-2 విస్తరణ అంశంలో ముందుకు కదల్లేకపోతుంది. ఇటీవల పలు రాష్ర్టాల్లో మెట్రో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ, హైదరాబాద్ ప్రాజెక్టును పక్కనపెట్టడంతో ఆ నిర్మాణ సంస్థ కూడా విస్తరణ పనుల విషయంలో సందిగ్ధంలో పడింది.
రెండో దశ మెట్రో విస్తరణ ద్వారా నగరంలో దాదాపు 161 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గానికి కాంగ్రెస్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసి, కేంద్రానికి డీపీఆర్లను అందజేసింది. కానీ డిజైనింగ్, నిర్వహణ, జనసాంద్రత వంటి అంశాల విషయంలో కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ స్పష్టత కోరడంతో ఈ ప్రాజెక్టు అనుమతులు జాప్యం అవుతున్నాయి. ఇందులోనే కొన్ని సంక్లిష్టమైన మార్గాలు కూడా ఉండటమే ప్రాజెక్టు ఆమోదానికి జాప్యానికి కారణమనే విమర్శలు ఉన్నాయి.
ఫోర్త్ సిటీకి ప్రాధాన్యత..
కాంగ్రెస్ సర్కారు నగరంలో మెట్రో విస్తరణ కంటే జనాసంచారమే లేని ఫోర్త్ సిటీకి మెట్రోను పరుగులు పెట్టించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ కోర్ సిటీలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నార్త్ సిటీ మెట్రో అంశంపై స్థానికంగా తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో అనివార్యంగానే ఆ ప్రాజెక్టును పార్ట్-బీలో చేర్చిన సర్కారు, ఫోర్త్ సిటీ, జేబీఎస్-శామీర్పేట్, మేడ్చల్ మెట్రో మార్గాలకు అనుమతులు తీసుకునేందుకు సిద్ధమైంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఏ ప్రాంతానికి విస్తరణ అవసరం అనే విషయాలపై మరింత స్పష్టత కోరడంతో.. కాంగ్రెస్ సర్కారు తడబాటు నగర మెట్రో విస్తరణకు శాపంగా మారిందని తెలిసింది. జనాలే లేని ఫోర్త్ సిటీకి మెట్రో ఎందుకనే అంశమే నగరంలో మెట్రో విస్తరణ ప్రధాన అడ్డంకిగా మారిందనే విమర్శలు ఉన్నాయి.