చాదర్‌ఘాట్, ఏప్రిల్ 9 : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ నం.1 సీఎంగా కేసీఆర్ కొనసాగుతున్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం ఆజంపురాలోని ఆజం ఫంక్షన్ హాల్లో మలక్‌పేట, యాకుత్‌పురా, చార్మినార్, చంద్రాయణగుట్ట నియోజకవర్గాల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఆజం అలీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్‌తో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను పూర్తిగా నివారించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పాతనగరంలోని పార్టీ నేతలకు తప్పకుండా సముచిత స్థానం దక్కుతుందని హామీనిచ్చారు. 60లక్షల సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.
దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్గా సీఎం కేసీఆర్ మార్చారని పార్టీ జిల్లా ఇన్చార్జీ దాసోజు శ్రవణ్ అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను తమ రాష్ర్టాల్లో అమలు చేయాలని ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలు కోరుతున్నాయని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు, చెరువులు, వాగులు నీళ్లతో కళకళలాడుతున్నాయని, ఎటువైపు చూసినా పచ్చని పంట పొలాలతో రైతులు సిరులు పండిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి పై దార్శనికత ఉన్న సీఎం కేసీఆర్ ఆలోచనతో ఇది సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు లాయక్ అలీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొరుడు భూమేశ్, డివిజన్ అధ్యక్షుడు కారింగల మారుతి, కామేశ్, శ్రీనివాస్‌రెడ్డి, హయత్ హుస్సేన్ హబీబ్, జగన్ పాల్గొన్నారు.