Metro Train | సిటీబ్యూరో: నార్త్ హైదరాబాద్కు అత్యంత కీలకమైన మెట్రోపై హెచ్ఎంఆర్ఎల్ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. రెండో దశ విస్తరణలో భాగంగానే నార్త్ సిటీ మెట్రోను నిర్మించాలనే డిమాండ్ పెరుగుతూ ఉండగా, ఫేస్-2 ప్రాజెక్టుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నదంటూ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ సమావేశంలో ప్రకటించారు. దీంతో నార్త్ సిటీ మెట్రో విషయంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగనార్త్ సిటీ ప్రతిపాదనలు లేకుండానే డీపీఆర్ కేంద్రానికి చేరగా, అనుమతులు రావడమే ఆలస్యం అన్నట్లుగా చూస్తున్నారు. కానీ రెండు నెలలుగా ప్రతిపాదనలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈ సమయంలోనే నార్త్ సిటీ వరకు మెట్రో తప్పనిసరిగా నిర్మించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ఈ విషయంలో పునరాలోచన చేస్తున్నదని, సానుకూలమైన నిర్ణయంతో ఫేస్-2పై ప్రకటన చేస్తుందని భావించారు. డిసెంబర్ 30న జరిగే క్యాబినెట్ ఏజెండాలో పెట్టాలంటూ నగరవాసులు కోరారు. కానీ క్యాబినెట్ సమావేశం వాయిదా పడటంతో… ఈ విషయం మరింత సంక్లిష్టంగా మారింది. నార్త్ సిటీ మెట్రోను రెండో దశలోనే చేపట్టాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఇటీవల మెట్రో ఫేస్-2 విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసింది. ముఖ్యంగా జనసంచారం అధికంగా ఉండే నార్త్ సిటీ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఫోర్త్ సిటీ, షాద్ నగర్ వరకు మెట్రో విస్తరిస్తామని ప్రకటించడంపై ఆ ప్రాంత జనాలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఫేస్-2లోనే నార్త్ సిటీ వరకు మెట్రో విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే మెట్రో పనులు చేపట్టే అవకాశం ఉన్నట్లు హెచ్ఎంఆర్ఎల్ వర్గాల ద్వారా తెలిసింది.