సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): ఓల్డ్‌సిటీ మెట్రో పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారయ్యాయి. హైకోర్టు నిర్ణయంతో ప్రాజెక్టు ఆగలేదు కానీ పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. నిర్మాణాల కూల్చివేత, ఆస్తుల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో అనుకున్న రీతిలో మెట్రో పనులు సాగడం లేదు. ఓల్డ్ సిటీ మెట్రో శంకుస్థాపన రోజునే 3 నెలల్లో భూసేకరణ పూర్తిచేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినా నిర్మాణ పనుల్లో ఆశించిన పురోగతి లేదు. ఇప్పటికీ మొత్తం గుర్తించిన ఆస్తులలో 30శాతం మేర నిర్మాణాలు మాత్రమే హెచ్ఎంఆర్ఎల్కు బదిలీ కాగా, మిగిలిన ఆస్తుల సేకరణ ఎప్పటిలోగా అవుతుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఓవైపు మెట్రో పనులు సాగుతున్నాయని చెబుతూనే… మరోవైపు హైకోర్టు వద్ద కేసులు విచారణలో ఉన్నాయంటూ సన్నాయి నొక్కులతో హైదరాబాద్ మెట్రో సంస్థ నెట్టుకొస్తోంది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ్‌గుట్ట వరకు నిర్మించనున్న 7.5 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టు నత్తనడకన సాగుతున్నాయి.
నత్తనడకన భూసేకరణ..
మెట్రో కోసం భూసేకరణ వేగంగా జరుగుతున్నాయంటూనే… చారిత్రక కట్టడాలపై కోర్టు వ్యవహారాలు ప్రధాన ఆటంకంగా మారుతున్నట్లుగా ఉన్నతాధికారులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఓల్డ్‌సిటీ మెట్రో పట్టాలెక్కిస్తామని చెప్పినా… 6 నెలలుగా భూసేకరణ నత్తనడకన సాగుతూనే ఉంది. మూడు నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తిచేసి, కూల్చివేతలు తుదిదశకు చేరాల్సి ఉన్నా… హెచ్ఎంఆర్ఎల్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ప్రాజెక్టును మరింత ఆలస్యం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి.
ప్రతిపాదనలన్నీ కేంద్రం వద్దే…
ఫేజ్-2 విస్తరణలో భాగంగా చేపట్టిన ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టును దాదాపు రూ.2,300 కోట్ల వ్యయంతో నిర్మించనుండగా… ప్రతిపాదనలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. డీపీఆర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే గానీ, ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కానట్టే. ఇప్పటికే ఓల్డ్ సిటీ మెట్రోకు రైట్ ఆఫ్ వే, భూసేకరణ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. భూసేకరణ వేగవంతం చేశామని చెబుతున్నా…మొత్తం ఆస్తులలో సగం కూడా సేకరించలేదు.అడపాదడపా కొన్ని నిర్మాణాల వద్ద కూల్చివేతలు మొదలుపెట్టిన హెచ్ఎంఆర్ఎల్.. అదే తీరుగా పనులు సాగుతున్నట్లుగా చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఎదురైన ఇబ్బందులతో అనుకున్న వేగంగా మాత్రం సంస్థ ముందుకు కదల్లేకపోతుందని సమాచారం.