సిటీబ్యూరో, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ) : భూముల వేలం ప్రక్రియలో హెచ్ఎండీఏ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా భూముల వేలంలో పాల్గొనేందుకు తీసుకునే ధరావతు(బయానా లేదా ఈఎండీ)ని అమాంతం పెంచేసింది. దాదాపు 100శాతం ఈఎండీని పెంచగా… వేలానికి ముందే వడపోసేలా హెచ్ఎండీఏ వ్యవహారిస్తోంది. దీంతో హెచ్ఎండీఏ ప్లాట్లు అంటేనే వేలానికి ముందే మరింత ఖరీదుగా మారిపోయాయి. ఒకేసారి భారీ ధరావతు చెల్లించాల్సి రావడంతో సాధారణ వ్యక్తులు కొనలేని పరిస్థితులు ఏర్పడనున్నాయి. వేలానికి ముందే కోట్లలో బయానాగా చెల్లించాలనే నిబంధన వలన… గతంలో మాదిరి అందరూ కొనుగోలు చేసే వీల్లేకుండా పోతుంది.
హెచ్ఎండీఏ భూముల వేలం అంటేనే నగరంలో ఇదొక హాట్ టాపిక్. గతంలో ఎకరం వంద కోట్లకు ఈ వేలంలో దక్కించుకుని రియల్ వ్యాపారాన్ని పరుగులు పెట్టించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా వేలం పాటలో పాల్గొనాలంటే కోటి ఖర్చు చేస్తే గానీ వీలు కాదనీ నిబంధనలు ముందుకు తీసుకువచ్చింది. గతంలో ప్లాట్ల సైజుల వారీగా కాకుండా భూముల వేలంలో పాల్గొనేందుకు ధరావతును రూ. 1లక్ష నుంచి రూ. 5లక్షల వరకు నిర్ణయించారు. ఒక్క కోకాపేట్ మినహా ఏ వెంచర్లోనైనా ఇదే తీరుగా అమలు చేశారు. కానీ ఇప్పుడు వెంచర్తో సంబంధం లేకుండా హెచ్ఎండీఏ విక్రయిస్తున్న ప్లాట్లను సొంతం చేసుకోవాలంటే కోటి రూపాయలు ముందుగానే చెల్లింపులు జరిపితే గానీ సాధ్యం కానీ పరిస్థితి వచ్చింది.
బయానా మొత్తాన్ని వంద శాతం పెంచడంతో రూ. లక్ష నుంచి ఒక్కసారి కోటి రూపాయలకు చేరింది. దీంతో గతంలో లక్ష రూపాయలు చెల్లించి ఆన్లైన వేలంలో పాల్గొనే వారి సంఖ్య ఇప్పుడు పరిమితం కానుంది. అయితే వేలంపాటలో కొనుగోలు చేసేవారి కోసం వాయిదా విధానంలో చెల్లించుకునే వెసులుబాటు కూడా ఉండేది. దీంతో లక్ష రూపాయలతో వేలంలో పాల్గొని, ఒకవేళ ప్లాటు దక్కితే వాయిదా పద్ధతిలో చెల్లించుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు రూ. కోటిని ముందుగానే చెల్లించాలని చెప్పడం వలన వేలం ప్రక్రియ మరింత జటిలం కానుంది. దీంతో పరిమిత కొనుగోలుదారులతో వేలం పాట జరిగే అవకాశం ఉందని అధికారులు కూడా చర్చించుకుంటున్నారు.
హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు మాత్రం గతంలో వేలం పాటలో కొనుగోలు చేసి, ఆ తర్వాత వాయిదా పద్ధతిలో ప్లాట్లకు డబ్బులు చెల్లించలేని వారే ఎక్కువ ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే ధరావతు మొత్తాన్ని రూ. కోటికి పెంచడం వలన అనవసరంగా పాల్గొనే వారి సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు. కానీ మంది ఎక్కువగా ప్లాట్ల కోసం పోటీ పడినప్పుడే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. ఇప్పుడు కోటి రూపాయలు ముందుగా చెల్లించిన వారు మాత్రమే వేలంలో పాల్గొనేలా ముందస్తు వడపోత కారణంగా… వేలానికి ఆదరణ ఆశించిన స్థాయిలో రాదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా హెచ్ఎండీఏ తీసుకున్న నిర్ణయం కేవలం బడా నిర్మాణ సంస్థలకు మాత్రమే లబ్ధి చేకూర్చుతోందనే వాదనలు ఉన్నాయి. దీంతో ఎగువ మధ్యతరగతి, సాధారణ ఎన్ఆర్ఐ వర్గాల నుంచి పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంటుంది.