సిటీబ్యూరో, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ) : నిత్యం రద్దీగా ఉండే నగరంలో ప్రముఖ కమర్షియల్ ఏరియాల్లో ఒకటి. మార్కెట్ ధరలు విపరీతంగా ఉన్న ఆ ప్రాంతంలో భారీ అంచనాలే ఉన్నాయి. కానీ హెచ్ఎండీఏ నిర్వహించిన భూముల వేలం పలు అనుమానాలకు తావిచ్చేలా… అప్సెట్ ధరలో 10 శాతం కూడా ఎక్కువ రాలేదు. పేరుకు ఈ వేలం నిర్వహిస్తున్నా.. క్షేత్రస్థాయి ఫలితాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. హెచ్ఎండీఏకు రూ. 100 కోట్లకు దాటాల్సిన ఈ ప్రాపర్టీ ఎందుకు అండర్ వాల్యూ ధరలో ట్రేడ్ అయిందనే ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న భూముల వేలంలో రెండో దఫాగా సోమవారం సరూర్ నగర్‌లోని దాదాపు 4,300 గజాల స్థలానికి బహిరంగ మార్కెట్లోకి తీసుకువచ్చింది.
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ గ్రామం, మండల పరిధిలోని 4,356 చదరపు గజాల విలువైన భూమికి జరిగిన ఈ-వేలం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ వేలం ద్వారా రూ.100 కోట్లకు పైగా ఆదాయం రాబట్టాలని భావించిన అధికారుల ఆశలు అడియాశలయ్యాయి. వేలం పూర్తయ్యేసరికి మొత్తం రూ.71.44 కోట్ల ఆదాయంతోనే సర్దుకుపోవాల్సి వచ్చింది. ఈ ల్యాండ్ పార్సిల్ కు అధికారులు చదరపు గజానికి రూ.1,50,000 కనీస ధర (అప్ సెట్ ప్రైస్)గా నిర్ణయించారు. అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న భూమి కావడంతో బిడ్డింగ్ భారీగా ఉంటుందని భావించినప్పటికీ, పోటాపోటీ వాతావరణం కనిపించలేదు. గరిష్టంగా చదరపు గజానికి రూ.1,64,000 మాత్రమే నమోదు కావడం గమనార్హం.
ప్రైమ్ ఏరియాలో కమర్షియల్ బిట్టు సరూర్ నగర్ ప్రాంతం ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, ఇన్నర్ రింగ్ రోడ్ లకు అత్యంత సమీపంలో ఉండటంతో పాటు, మెరుగైన రవాణా వ్యవస్థ, మౌలిక వసతులు ఉన్న ప్రాంతం. భవిష్యత్తు అభివృద్ధికి, వాణిజ్య అవసరాలకు అనుకూలమైన స్థలమైనప్పటికీ ఈ స్థాయిలో నీరుగారిన స్పందన రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.బహిరంగ మారెట్ లో సరూర్ నగర్ వ్యాప్తంగా చదరపు గజం భూమి విలువ ప్రస్తుతం రూ.2.5 లక్షలకు పైనే పలుకుతోంది. అలాంటిది ప్రభుత్వం నిర్వహించిన అధికారిక ఈ-వేలంలో గజానికి కేవలం రూ.1.64 లక్షల వద్దే బిడ్డింగ్ ఆగిపోవడం, అత్తెసరు స్పందన మాత్రమే రావడంపై ఇప్పుడు పలు అనుమానాలు, వ్యూహాత్మక లోపాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి ఈ సైట్ విషయంలో మొదటి నుంచి పలు అనుమానా లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి కుటుంబీకులు హస్తగతం చేసుకునే ప్రయత్నాలు చేశారు. గతంలో ఈ భూమిని లీజు ప్రాతిపదికన హెచ్ఎండీఏ కట్టబెట్టే ప్రయత్నం చేసింది. కానీ తీవ్ర వ్యతిరేకత రావడం, హెచ్ఎండీఏ చర్యల వెనుక ప్రైవేటు వ్యక్తు ల ప్రయోజనాలపై తీవ్ర చర్చ జరిగింది. దీంతో ఈ విషయంలో వెనక్కి తగ్గింది. ఆ తర్వాత ఇక్కడే… అమీర్‌పేట్‌లోని మైత్రీ వనం తరహాలో భారీ కమర్షియల్ టవర్స్ నిర్మించాలని హెచ్ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై ఇంజినీరింగ్ అధికారులు కూడా బృహత్ ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ తెర వెనుక జరిగిన వ్యవహారాల్లో ఈ ప్రతిపాదన కూడా అటకెక్కింది. అనూహ్యంగా ఈ భూ మిని వేలానికి పెట్టింది. అయితే రికార్డు స్థాయిలో ధర పలకాల్సిన ఈ ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా రింగ్ తరహా నియంత్రణ జరిగిందనే ఆరోపణలు హెచ్ఎండీఏ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.