ఓవైపు కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు.. మరోవైపు పనులు చేపట్టేందుకు నిధులు లేక హెచ్ఎండీఏ అల్లాడిపోతోంది. ఇలాంటి సమయంలో నిధుల సమీకరణపై ఆ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సెప్టెంబర్ లో రంగారెడ్డి జిల్లా పరిధిలో డెవలప్ చేసిన వెంచర్లలో ప్లాట్లను విక్రయించేందుకు సిద్ధమైంది. ఆ తర్వాత మరిన్ని నిధుల సమీకరణలే లక్ష్యంగా హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్న ఆస్తులను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది.కొత్త ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు వెచ్చించే అవకాశం లేకపోవడంతో అదనపు నిధుల కోంస హెచ్ఎండీఏ తన సొంత ఆస్తులనే ప్రధాన ఆదాయంగా మార్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
సిటీబ్యూరో, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): ఏడు జిల్లాల నుంచి పదకొండు జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏకు నిధుల సర్దుబాటు అత్యంత కీలకంగా మారింది. కొత్తగా హెచ్ఎండీఏలో కలిసిన జిల్లాలకు మౌలిక వసతులను కల్పించాలంటే ప్రస్తుతం ఉన్న ఆదాయానికి అదనపు మార్గాలను అన్వేషించాల్సిందే.
ఈ క్రమంలో మౌలిక వసతులు పెరిగితే గానీ, ఆదాయానికి ఆస్కారం లేకపోవడంతో… హెచ్ఎండీఏ ఆస్తులను ఆదాయ వనరులుగా మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. గడిచిన 18 నెలల కాలంలో హెచ్ఎండీఏ ఆదాయం పడిపోవడం, నగరంలో రియల్ ఎస్టేట్ కార్యాకలాపాలు నిలిచిపోవడం వంటి ప్రతికూల పరిస్థితులతో కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తే గానీ, ప్రతిపాదనలో ఉన్న కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కేందుకు వీల్లేని పరిస్థితి. అయితే ఆదాయానికి మించి ప్రతిపాదనలు చేతిలో ఉండటంతో ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితి.
కీలకంగా మారిన నిధుల సర్దుబాటు..
హెచ్ఎండీఏ పరిధిలో పలు కీలక ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. ముఖ్యంగా ఎలివేటెడ్ కారిడార్, రేడియల్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణం పేరిట రూ.20-25వేల కోట్ల అంచనాలు ఉన్నాయి. కానీ నిధుల సర్దుబాటు లేక ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు సాగడంలేదు. కనీసం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు విషయంలో భూసేకరణ కూడా పూర్తి చేయలేకపోయింది. రక్షణ శాఖకు పరిహారంగా భూములను బదలాయిస్తున్నా… ప్రైవేటు ఆస్తుల వ్యవహారమే హెచ్ఎండీఏకు తలకుమించిన భారంగా తయారయ్యింది.
వేలం తర్వాత ఆస్తులపై అధ్యయనం..
నిధుల వేటలో.. నగర శివార్లలోని వందలాది ఓపెన్ ప్లాట్లను కలిగి ఉన్న హెచ్ఎండీఏ.. వీటిలో కొన్నింటిని వేలం వేసేందుకు సిద్ధమైంది. వీటి తర్వాత హెచ్ఎండీఏకు ఉన్న కమర్షియల్ కాంప్లెక్సులను కూడా ఆదాయ వనరులుగా మార్చే అంశంపై అధ్యయనం చేయనున్నారు. కమర్షియల్ ఆస్తులను తనఖా పెట్టడం వలన ఎంత ఆదాయం వస్తుంది అనే అంశంపై అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం.