సిటీబ్యూరో: ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీం దరఖాస్తులకు గ్రహణం పట్టుకున్నట్లు ఉంది. హెచ్ఎండీఏ పరిధిలో క్రమబద్ధీకరణకు వచ్చిన సుమారు మూడున్నర లక్షల దరఖాస్తులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. హైడ్రా, ఎన్ఓసీ వంటి కారణాలతో దరఖాస్తులను అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఫీజులు చెల్లించిన దరఖాస్తుదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనేది ఆందోళన కలిగిస్తున్నది.
హెచ్ఎండీఏ పరిధిలో పెండింగ్లో ఉన్న 3.60లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 3.60లక్షల మంది ఓపెన్ ప్లాట్లను క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా, ఇందులో 1.16 లక్షల దరఖాస్తులను పరిశీలించారు. వీటిలో 80వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. వీటితోపాటు మరో 75వేల దరఖాస్తులను షార్ట్ ఫాల్స్ చూపుతూ కొర్రీలు పెట్టారు. ప్రీలిమినరీ ఎలిమినేషన్ ప్రక్రియ ముగియగా… ఫీజులు చెల్లించిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్ ఫాల్స్ పేర్కొంటూ దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. దీంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ నెలల తరబడి కొనసాగుతూనే ఉంది. అయితే పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కారించాలని భావించింది. కానీ తాజాగా హైడ్రా, జీపీ లే అవుట్ల ప్లాట్లపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఏడాది కాలంగా దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. అసలు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఎప్పుడూ పూర్తి అవుతుందని దరఖాస్తు దారులు వాపోతున్నారు. ముఖ్యంగా షార్ట్ ఫాల్స్ విషయంలో దరఖాస్తుదారులకు తలనొప్పులు తప్పడం లేదు. ముఖ్యంగా హైడ్రా వచ్చిన తర్వాత రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల నుంచి వచ్చే ఎన్ఓసీలు అత్యంత కీలకంగా మారడంతో.. అసలు తమ భూములు రెగ్యులర్ చేస్తారా లేదా అనేది ఇప్పటికీ తెలియడం లేదు.