సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నగరంలో ఓవైపు కాలుష్యం తీవ్రత పెరుగుతుంటే, మరోవైపు ప్రాణవాయువును అందించే భారీ వృక్షాలను కూల్చేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తుంది. రోడ్డు విస్తరణ కోసం ఏకంగా 470 వృక్షాలను హెచ్ఎండీఏ తొలగించనుంది. దీనికి అవసరమైన అనమతుల కోసం ఏకంగా రూ.7లక్షలు ఖర్చు చేయనుంది. మియాపూర్ చౌరస్తా నుంచి గండిమైసమ్మ వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ పనులు చేపడుతుంది.
దీనికి అడ్డుగా ఉన్న చెట్లను తొలగించడంతో పాటు, కొన్నింటిని ట్రాన్స్ లొకేట్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు వెయ్యి వృక్షాలను ట్రాన్స్ లొకేట్ చేయనుండగా… మరో 470 చెట్లను పక్కన పెట్టేయనున్నారు. అయితే హెచ్ఎండీఏ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో భారీగా పెరిగిన చెట్లను తొలగించడం వల్ల కాలుష్యం తీవ్రత పెరుగుతుందని స్థానికులు, పర్యావరణ, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.