HMDA | సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ తరలింపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆగస్టు మొదటి వారంలోనే నగరంలో పలు చోట్ల ఉన్న హెచ్ఎండీఏ విభాగాలన్నింటినీ ఒకే చోటకు తరలించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కానీ నెమ్మదిగా సాగుతున్న పనుల కారణంగా మరింత జాప్యం జరగనున్నది.
ఆరు నెలల కిందటే ఆదేశాలు జారీ చేసినా… ఇప్పటికీ పనులు సాగుతూనే ఉన్నాయి. దీంతో హెచ్ఎండీఏ కార్యాలయాల తరలింపునకు మరికొంత సమయం పట్టేలా ఉన్నదని హెచ్ఎండీఏ వర్గాలు పేర్కొన్నాయి. చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేటలోని పైగా ప్యాలెస్‌కు హెచ్ఎండీఏ విభాగాలన్నీ తరలించాలని మార్చి 12న ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ప్రత్యేక జీవో జారీ చేశారు.
అమీర్‌పేటలో హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం, నానక్‌రాంగూడలో ఓఆర్ఆర్, గ్రోత్ కారిడార్ ఆఫీస్, ట్యాంక్ బండ్ సమీపంలో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయాలు ఉండగా, వీటన్నింటినీ ఒకే వేదిక మీదకు తీసురావడం ద్వారా పాలనాపరమైన నిర్వహణ మరింత సులభతరం అవుతుందని దానకిశోర్ ఆదేశించారు.
కార్యాలయాన్ని ఒకే చోట ఉండాలనే సర్కారు నిర్ణయంతో ఆదేశాలు జారీ చేసినా.. ఇప్పటికీ తరలింపు ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఆదేశించిన వారం లోపే ఇంజినీరింగ్ విభాగం పైగా ప్యాలెస్‌లో ఉన్న మౌలిక వసతులపై అధ్యయనం చేసిన అనంతరం పనులు మొదలుపెట్టారు. కానీ ఇప్పటికీ కొనసాగుతున్న నిర్మాణ పనులతో తరలింపు ప్రక్రియ ఎప్పుడనేది ఇంకా స్పష్టత లేదు.
లక్ష చదరపు అడుగుల్లో..
ఏడు జిల్లాలో విస్తరించి ఉన్న హెచ్ఎండీఏ విభాగాలన్నింటినీ ఒకే చోట నుంచి విధులు నిర్వర్తించేందుకు పైగా ప్యాలెస్‌లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఆఫీస్ స్పేస్‌కు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.