సిటీబ్యూరో: ఔటర్ రింగు రోడ్డుపై మరో రెండు ఇంటర్ ఛేంజ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం 23 ఎగ్జిట్లు ఉండగా, వీటి సంఖ్యను 25కు పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. నగరం నుంచి ఔటర్ రింగు రోడ్డుకు వచ్చేందుకు వీలుగా మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఎగ్జిట్ల సంఖ్యను 25కు పెంచాలనే ప్రతిపాదన ఉండగా, రెండేండ్ల తర్వాత కొలిక్కి వస్తోంది.
ఇటీవలే కోకాపేట ట్రంపెట్ను అందుబాటులోకి తీసుకువచ్చిన హెచ్ఎండీఏ… నియోపోలిస్ నుంచి వచ్చే వాహనాలు నేరుగా ఓఆర్ఆర్ మెయిన్ కాజ్ వేపైకి వెళ్లేందుకు వీలుగా నిర్మించారు. ఔటర్ చుట్టూ ఉన్న ఎగ్జిట్ల సంఖ్యను పెంచుతూ రవాణా సదుపాయాలు కల్పిస్తున్నారు. మరో రెండు ఎగ్జిట్లను కూడా నిర్మించడం ద్వారా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి రవాణా సదుపాయాలు మెరుగుపడతాయని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రస్తుతం ఉన్న ఎగ్జిట్ల మధ్య ఉన్న వాహనాల రద్దీ, ఎగ్జిట్లకు సమీపంలో పెరుగుతున్న జనసాంద్రతను అంచనా వేశారు.