సిటీబ్యూరో, జనవరి 1(నమస్తే తెలంగాణ) : ఆర్థికంగా నిర్వీర్యమైన సర్కారుకు హెచ్ఎండీఏ భూములే ప్రధాన ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఆరు నెలల వ్యవధిలో ఏకంగా రూ. 6వేల కోట్లను తెచ్చిన హెచ్ఎండీఏ… ప్రభుత్వానికి బంగారు గుడ్లను పెట్టే బాతులా మారింది. ప్రభుత్వ అంచనాలకు మించి విలువైన భూములతో రెవెన్యూ సమకూర్చడంలో హెచ్ఎండీఏ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు నిర్వహించిన భూముల వేలం ద్వారా దాదాపు 50 ఎకరాలను విక్రయించి రూ.6438 కోట్లను అందించింది. భూముల వేలం ద్వారా ఖజానా నింపుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న సర్కారుకు హెచ్ఎండీఏ ప్రధాన వనరుగా మారి, వేల కోట్లను తీసుకువచ్చి పెడుతున్నది. ఇప్పటివరకు నిర్వహించిన భూముల వేలంలో ఒకేసారి రూ. 6438 కోట్లను తెచ్చింది.
ఈ ఏడాది జూన్ నాటి నుంచి డిసెంబర్ వరకు జరిగిన వేలంలో 72 ఎకరాలను విక్రయించడంతో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చేరాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోవడంతో భూముల వేలం ద్వారానే చేరాయి. ఇందులో అత్యధికంగా కోకాపేట్ నియోపోలిస్ నుంచి ఎకరం రూ. 150 కోట్లకు పలికింది. కాగా, ఈ ఏడాది కాలంలో కోకాపేట నియోపోలిస్, గోల్డెన్ మైల్, బహదూర్‌పల్లి, తొర్రూర్, తుర్కంయాంజల్ వంటి ప్రాంతాల్లో ఉన్న హెచ్ఎండీఏకు ఉన్న లే అవుట్లలో ప్లాట్లను విక్రయించింది. పలు దశల వారీగా నిర్వహించిన వేలంలో హెచ్ఎండీఏకు మంచి ఆదాయం మాత్రం కేవలం కోకాపేట నియోపోలిస్ నుంచి మాత్రమే వచ్చింది. ఇందులోనే 45 ఎకరాల ప్లాట్ల ద్వారా రూ. 3800 కోట్లు వచ్చి చేరాయి.
