సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు చేతి నిండా ప్రాజెక్టులు.. గల్లా పెట్టె నిండేలా రెవెన్యూ మార్గాలు. ఇంకేముంది కొత్త ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందించడమే ఆలస్యం… చకచకా ప్రాజెక్టులను పట్టాలెక్కించిన హెచ్ఎండీఏ… ఇప్పుడు నిధుల్లేక చేతులెత్తేస్తున్నది. ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినా… నిధుల్లేక ఇతర సంస్థలకు మళ్లించాల్సి వస్తోంది. ఎన్నో ప్రాజెక్టులు హెచ్ఎండీఏ చేతుల నుంచి జారిపోతున్నాయి. దీనికి హెచ్ఎండీఏకు నెలవారీగా వచ్చే ఆదాయం లేకపోవడమేననే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
హైదరాబాద్ నగరాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో హెచ్ఎండీఏ కీలకపాత్ర పోషిస్తోంది. 11 జిల్లాల పరిధిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు, మెరుగైన రవాణా సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్‌ల నిర్మాణంలో ముఖ్యభూమికను పోషించే హెచ్ఎండీఏ ఇప్పుడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేజార్చుకుంటున్నది. ఫ్లెఓవర్లు, ట్రక్ పార్కులు, లాజిస్టిక్ హబ్, ఐటీ కారిడార్లు, ఏకో పార్కులు, అర్బన్ ఫారెస్ట్రీలను అభివృద్ధి చేసిన హెచ్ఎండీఏ.. నిధుల్లేక చేతులేతేస్తున్నది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం అందకపోవడం… రెవెన్యూ మార్గాలు తగ్గిపోవడం ఇప్పుడు ఆ విభాగాన్ని ఖాళీ చేతులతో కూర్చునేలా చేస్తోంది.
అవుటర్ రింగు రోడ్డు నుంచి రీజనల్ రింగు రోడ్డును అనుసంధానం చేసేలా హెచ్ఎండీఏ గ్రీన్ ఫీల్డ్ హైవేను ఫ్యూచర్ సిటీ మీదుగా హెచ్ఎండీఏ-హెచ్‌జీసీఎల్ డిజైన్ చేసింది. అయితే ఈ ప్రాజెక్టు భూసేకరణ, ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయం తదితర అంశాలపై సుదీర్ఘంగా ప్రణాళికలు రూపొందించి ప్రాజెక్టు చేపట్టాల్సిన సమయానికి హెచ్ఎండీఏ చేతుల్లోనుంచి జారిపోయింది.
అదేవిధంగా నగరంలో లింకు రోడ్లను నిర్మాణంతో రవాణా సదుపాయాలను మెరుగుపరిచేలా నగర శివారుల్లో 49 లింకు రోడ్ల ప్రణాళికలను రూపొందించింది. ఈ ప్రాజెక్టును హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు నిధులిచ్చిన ప్రభుత్వం… ఆ సంస్థ ఆధ్వర్యంలో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నది. అదేవిధంగా మీరాలం లేక్‌ను సుందరీకరించాలనే లక్ష్యంతో గతంలోనే హెచ్ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.