సిటీబ్యూరో, జూలై 14(నమస్తే తెలంగాణ): అత్యంత పర్యావరణహితమైన బంజారాహిల్స్ భూములతో వేల కోట్లు ఆర్జించాలని సర్కార్ పన్నాగం చేస్తుంటే.. ఆ భూముల్లో ఏకో పార్క్ నిర్మించి పర్యావరణాన్ని పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విలువైన భూములే లక్ష్యంగా గడిచిన రెండున్నరేళ్లలో జీవవైవిధ్యాన్ని ప్రమాదంలో నెట్టిన కాంగ్రెస్ సర్కార్‌కు గట్టి తిరుగుబాటే మొదలైంది. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లోని 8.24 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయనున్న హెచ్ఎండీఏ నిర్ణయంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అరుదైన హరిత వనాన్ని కాపాడి, దానిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఏకో పార్క్‌గా అభివృద్ది చేయాలని, వెంకటేశ్వర కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ, పరిసర ప్రాంతాల ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు హెచ్ఎండీఏ కమిషనర్‌కు లేఖలో కోరారు.
ఈ వేలానికి నోటిఫికేషన్..
గత నెలలో హెచ్ఎండీఏ ఈ భూములకు సంబంధించిన ఈవేలం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే పక్కనే ఉన్న యమునా నగర్ సొసైటీతో భూ సరిహద్దుల వివాదాల కారణంగా, కోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఈ తరుణంలో కాలనీవాసులు, పర్యావరణ ప్రేమికులు రంగంలోకి దిగి, ఈ భూమిని శాశ్వతంగా పచ్చదనం కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న పచ్చని చెట్లతో నిండిన ఈ ప్రాంతాన్ని కాపాడటం ద్వారా నగరానికి ఎంతో అవసరమైన లంగ్ స్పేస్ నిలబడుతుందని స్పష్టం చేశారు.
ఏకో పార్క్ నిర్మాణం సమతుల్యత..
కేబీఆర్ పార్క్ ప్రాంతం చుట్టూ చేపడుతున్న అభివృద్ధ్ది పనులతో ఈ ప్రాంతంలో పర్యావరణ విధ్వంసం జరుగుతుందనే వాదన ఉంది. ఈ క్రమంలో కనీసం ఈ 8 ఎకరాల్లో విస్తరించి ఉన్న భూముల్లో గ్రీన్ జోన్ లేదా ఏకో పార్క్‌ను డెవలప్ చేయాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున్న వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రజలకు ఉపయోగపడేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలని స్థానికులు కోరతున్నారు.
మంత్రి పొన్నం హామీ.. పట్టించుకోని హెచ్ఎండీఏ
గతంలో షేక్‌పేట్ రెవెన్యూ అధికారులు ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేసిన సందర్భంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఈ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాణిజ్య అవసరాలకు వినియోగించేది లేదనీ, ప్రజల సౌకర్యార్థం ఒక సుందరమైన పబ్లిక్ థీమ్ పార్క్ లేదా ఏకో పార్క్‌గా మారుస్తామని కాలనీవాసులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కి ఈ స్థలాన్ని కమర్షియల్ హబ్‌గా మార్చడానికి హెచ్ఎండీఏ వేలం ప్రక్రియ చేపట్టడం ప్రజా ప్రయోజనాలకు కాలరాసినట్లే అవుతుందనీ కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు.
ఈ 8.24 ఎకరాల స్థలంలో బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలు, మాల్స్, హోటళ్లను నిర్మిస్తే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, 12తోపాటు పరిసర ప్రాంతాలపై వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. అలాగే రోడ్డు, తాగునీరు, డ్రైనేజీ, పార్కింగ్ వంటి మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ అరుదైన హరిత సంపద వేలం ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని సొసైటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పక్కనే ఉన్న హౌజింగ్ సొసైటీతో ఉన్న భూ సరిహద్దుల వివాదాన్ని పరిష్కరించేందుకు రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్ అధికారులతో తక్షణమే జాయింట్ ఫిజికల్ సర్వే నిర్వహించాలన్నారు.