సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ): మహానగరంలో ప్రాథమిక పౌరసేవలందించే జీహెచ్ఎంసీ తన ప్రాధాన్యతను క్రమంగా కోల్పోతోంది. సంస్థలో పేరుకుపోయిన అవినీతి, పారదర్శకత లోపించడం, విధి నిర్వహణలో జవాబుదారీతనం కొరవడటంతో ప్రభుత్వం కీలక బాధ్యతలను ఇతర సంస్థలకు బదిలీ చేస్తోంది.ఒకప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనేక అధికారాలు ఇప్పుడు హెచ్ఎండీఏ, హైడ్రా చేతుల్లోకి మారుతున్నాయి.
నాలా పూడికతీత, మాన్సూన్ పనులు, ఫైర్ సేఫ్టీ తదితర నిర్వహణ బాధ్యతలను హైడ్రానే చేపడుతున్నది. బహుళ అంతస్తుల భవనాల ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ల జారీతో పాటు వర్షాకాలంలో సహాయక చర్యలు అందించే మాన్సూన్ బృందాల నిర్వహణను కూడా జీహెచ్ఎంసీ నుంచి ఉపసంహరించి హైడ్రాకు అప్పగించారు. నగర పరిధిలోని చెరువులు,పారుల సంరక్షణను కూడా హైడ్రా తన ఆధీనంలోకి తీసుకుంటూ వస్తున్నది. తాజాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ఏఓసీ రోడ్ల మూసివేత సమస్యకు పరిషారంగా రక్షణ శాఖకు జవహర్‌నగర్‌లో దాదాపు 260 ఎకరాల భూములు కేటాయించారు.
ఈ క్రమంలోనే లంగర్‌హౌస్, గోలొండ, సెవెన్ టూంబ్స్ సహా నాలుగు కీలక డిఫెన్స్ రోడ్ల విస్తరణ, అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను జీహెచ్ఎంసీ నుంచి హెచ్ఎండీఏకు బదిలీ చేశారు. అంతకు ముందు 10 అంతస్తులు దాటిన భవనాల నిర్మాణ అనుమతుల అధికారాలను కూడా హెచ్ఎండీఏ స్వాధీనం చేసుకున్నది. త్వరలోనే భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనలు, నాణ్యతాలోపాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలోనూ జీహెచ్ఎంసీ వైఫల్యం చెందిందనే విమర్శలున్నాయి. భవనాల భద్రత, నిబంధనల అమలు పకాగా జరిగేలా ఓసీల జారీ అధికారాలను కూడా త్వరలో హైడ్రాకు బదిలీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.