సెయిలింగ్ పురుషుల స్కిఫ్ ఈవెంట్లో కేరళకు చెందిన కజిన్స్ మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ రజత పతకం సాధించాడు. తొమ్మిది రేసుల కాంబినేషన్ పోటీ ముగిసేసరికి భారత జంట మొత్తం 23 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి పతకాన్ని ఖాయం చేసుకుంది. ఈ పోటీలలో తక్కువ పాయింట్లు సాధించిన వారు విజేతలుగా నిలుస్తారు. చైనా (16 పాయింట్లు) స్వర్ణం గెలుచుకోగా, హాంకాంగ్ (24 పాయింట్లు) కాంస్యం అందుకుంది. ఎర్నాకులానికి చెందిన ప్రిన్స్ నోబుల్ తండ్రి ఒక జాలరి.
2018లో కేరళను ముంచెత్తిన భయంకరమైన వరదల్లో అతని తండ్రి ప్రాణాలు కోల్పోయినా సముద్రంతో ఉన్న అనుబంధం ప్రిన్స్‌ను భయపెట్టలేకపోయింది. 2009లో 13 ఏండ్ల వయసులో సెయిలింగ్ ప్రారంభించిన ప్రిన్స్.. తన తొలి ఆసియాడ్లోనే రజతం సాధించి తండ్రి కన్న కల నెరవేర్చాడు. మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ నోబుల్ తల్లులు అక్కాచెల్లెళ్లు. ఇద్దరూ కలిసి ఒకే చోట పెరిగారు. ఈ ఇద్దరూ గత 10 ఏండ్లుగా కలిసి పోటీపడుతున్నారు. మరోవైపు మహిళల స్కిఫ్ విభాగంలో పోటీపడిన హర్షిత తోమర్- శీతల్ వర్మ జోడీ 9 రేసుల్లో 28 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకుంది.