అధికారాన్ని అడ్డం పెట్టుకొని సీఎం రేవంత్, ఆయన అన్నదమ్ములు, బామ్మర్ది సాగిస్తున్న దోపిడీని బయట పెట్టినందుకే మాపై ఆక్రోశం వెళ్లగక్కుతున్నడు. సిరిసిల్లకుపోయి సొల్లు పురాణం చెప్పిండు. 4వేల మంది ఖాకీలను పెట్టుకొని, దుకాణాలు బంద్ పెట్టి పోజులు కొట్టుకుంటూ పాదయాత్ర చేసిండు. అది పాదయాత్రనా లేక ప్రజలపై దండయాత్రనా?
కాంగ్రెస్ పాలనలో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా రైతులు అరిగోస పడుతున్నరు.. కరెంట్ అందక ఇక్కట్ల పాలవుతున్నరు.. యూరియా కోసం పడిగాపులు కాస్తున్నరు.. నీళ్లు లేక ఎండిన పంటలను చూసి గొల్లుమంటున్నరు. మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన సర్కార్‌పై రగిలిపోతున్నరు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వారికోసం కొట్లాడుమని మమ్మల్ని కోరుతున్నరు.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : తన ఆస్తులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ‘రేవంత్‌రెడ్డి లెక్క నేను మంది మీద పడి దోచుకోలేదు.. మా తాతల ఆస్తుల నుంచి మీ తాతల ఆస్తుల వరకు విచారణ చేయించండి.. అందుకు నేను రెడీ.. సీఎం సిద్ధమా’ అని చాలెంజ్ చేశారు. అధికారం అండతో సీఎం రేవంత్ బ్రదర్, బామ్మర్ది సాగిస్తున్న దోపిడీని బయటపెట్టినందుకే తమపై రేవంత్ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని, అందుకే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సిరిసిల్లలో సొల్లు పురాణం, పచ్చి అబద్ధాలు వల్లెవేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నాడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినట్టే ఇప్పుడు కూడా పాలనావైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం తెలంగాణ భవన్లో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరగా, కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
సిరిసిల్ల సభలో సీఎం ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. పోలీసుల మధ్య పాదయాత్ర చేసిన రేవంత్‌రెడ్డి నల్లమల పులికాదు.. ఏపీ సీఎం చంద్రబాబు సంకలో పిల్లి అంటూ చురకలంటించారు. ముఖ్యమంత్రి వస్తే తమకు మేలు జరుగుతదని, వరాలు జల్లు కురిపిస్తారని ఎదురుచూసిన నేత కార్మికుల ఆశలపై నీళ్లు చల్లారని ఆగ్రహం వ్యక్తంచేశారు.తాము ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన వివరాలనే సభకు వచ్చిన కార్యకర్తలకు చెప్పి బీఆర్ఎస్పై బురదజల్లి ప్రజలను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ఎన్ని ఆరోపణలు చేసినా.. చిల్లర మాటలతో బద్నాం చేసినా ఆయన చేస్తున్న దుర్మార్గాలు, అక్రమ వ్యవహారాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఆధారాలతో బండారం బయటపెట్టి తగిన బుద్ధి చెబుతామని గట్టిగా హెచ్చరించారు.

Ktr
చెప్పినట్టే ఎన్కటి రోజులు తెచ్చిండు..
ఎన్కటి రోజులు తీసుకొస్తానని ఎన్నికల ముందు చెప్పినట్టే రేవంత్ పరిపాలన ఉన్నదని కేటీఆర్ విమర్శించారు. నిజాయితీ కలిగిన మోసగాడైన మన ముఖ్యమంత్రి ఆచరణలోనూ అదే తీరున వ్యవహరిస్తున్నారని దెప్పిపొడిచారు. తెలంగాణలో రైతులు, చేనేత కార్మికులు, యువత, బీసీలు, దళితులు, మైనారిటీలు సహా అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. ప్రజలు మోసం చేసేవాళ్లనే నమ్ముతారని రేవంత్‌రెడ్డి గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరంలో అవినీతిపై చిల్లర మాటలు
నాడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ. లక్ష అవినీతి జరిగిందని చిల్లర ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రాజెక్టుకు అయిన ఖర్చే రూ. 80వేల కోట్లయితే రూ. లక్ష కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ‘కాళేశ్వరంపై, కరెంట్ కొనుగోళ్లపై వేసిన కమిషన్ తుస్సుమన్నది.. ఫార్ములా ఈ రేసుపై సిట్ తేల్చిందేమీలేదు.. ఫోన్ ట్యాపింగ్‌పై దుష్ప్రచారం తేలిపోయింది’ అని స్పష్టంచేశారు. ప్రజలు ఖాళీగా, నిమ్మలంగా ఉంటే రేవంత్‌రెడ్డి ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు గుర్తుకు వస్తయని, నిలదీస్తరని చెప్పి అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సిరిసిల్ల నేతన్నలను విస్మరించిన సీఎం
సిరిసిల్ల పర్యటనలో ముఖ్యమంత్రి చేనేత కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా వెళ్లారని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనతో ఆత్మహత్యలు బంద్ అయ్యాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్లలో 35మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. నేతన్నల మరణాలపై సీఎం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల పరిహారమైనా ప్రకటిస్తారేమోనని ఆశించిన కుటుంబాలకు నిరాశే మిగిలిందని చెప్పారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన నేతన్న బీమా, ఇతర పథకాలను అటకెకించారని మండిపడ్డారు. అంతమాత్రం దానికి సిరిసిల్ల వరకు వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు.
దండయాత్రకు వెళ్లినట్టు పాదయాత్ర
సీఎం సిరిసిల్ల పర్యటన తీరుపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. పాదయాత్రగా వెళ్లినట్టుగా లేదని దండయాత్రలా ఉన్నదని విమర్శించారు. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి పర్యటించడం ప్రజల మధ్య పర్యటనలా లేదని విమర్శించారు. తనను తాను నల్లమల పులి అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి, సిరిసిల్లకు మాత్రం ఆరుగురు మంత్రులు, 30మంది ఎమ్మెల్యేలు, 4వేల మంది పోలీసుల పహారాతో వెళ్లారని ఎద్దేవా చేశారు. రైతులు, నేత కార్మికులకు ఒక కొత్త పథకం ప్రకటించకుండా కేవలం గత ప్రభుత్వంపై తిట్లు తిట్టడానికే సీఎం పర్యటిస్తున్నారని మండిపడ్డారు. ‘నల్లమల పులి అని చెప్పుకొంటడు.. నాలుగు వేల మంది పోలీసులను పెట్టుకుని పోతాడా? నువ్వు నల్లమల పులివి కాదు.. చంద్రబాబు సంకలో పిల్లివి’ అని విమర్శించారు. ప్రజల కోసం వచ్చారా.. సోషల్ మీడియాలో రీల్స్‌లో కోసం వచ్చారా? అని నిలదీశారు.
9వ తరగతి ఫెయిలైన కొండల్‌రెడ్డి ఏరోస్పేస్ బిజినెస్
సీఎం బావమరిది సృజన్‌రెడ్డి కంపెనీకి ఎలాంటి అర్హత లేకపోయినా రూ.1,137 కోట్ల విలువైన టెండర్ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తే రేవంత్‌రెడ్డికి కోపం వస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. తొమ్మిదో తరగతి ఫెయిలైన సీఎం తమ్ముడు కొండల్‌రెడ్డి.. అకస్మాత్తుగా ఏరోస్పేస్ ఇంజినీర్‌గా మారారని ఎద్దేవా చేశారు. అర్హతలు లేని కొండల్‌రెడ్డి రాత్రికి రాత్రే ఏరోస్పేస్ కంపెనీ పెడితే, రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకే ఎలా కట్టబెట్టారని రేవంత్‌ను ప్రశ్నిస్తే తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు.
అమెరికాలో ఉండే రేవంత్‌రెడ్డి అన్న జగదీశ్‌రెడ్డికి రూ.1000 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు సీఎంతో ఒప్పందం చేసుకునేందుకు ముందుకొచ్చారని తెలిపారు. నిన్నటి వరకు పెద్దగా ఆస్తులు లేని కుటుంబ సభ్యులు వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతున్నారని, ప్రశ్నించినందుకే ముఖ్యమంత్రికి కోపం వస్తున్నదని విమర్శించారు. సీఎం కుటుంబ సభ్యులు అదానీని దాటిపోయేలా దోచుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ కుటుంబ సభ్యుల అక్రమాలను బయటపెట్టడంతో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు.
డిగ్రీ చేయడానికే రేవంత్‌కు ఎనిమిదేండ్లు
సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్హతలపై కేటీఆర్ సెటైర్లు వేశారు. తాను చదువుకున్న వ్యక్తినని, నాడు రేవంత్‌రెడ్డి చదువుకోలేదని, పెయింటర్‌గా ఉన్నారని గుర్తుచేశారు. తాను ఇండియాలో, పుణె యూనివర్సిటీలో, అమెరికాలో ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. రేవంత్‌రెడ్డి మాత్రం మూడేండ్ల డిగ్రీని 1984 నుంచి 1992 వరకు ఎనిమిదేండ్లపాటు చదివారని ఎద్దేవా చేశారు. అటువంటి వ్యక్తి ఇవాళ అసెంబ్లీలో అంతా తనకు ఉచితంగానే వచ్చిందని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. విద్య వచ్చింది, సంపద వచ్చిందని, ప్రగల్భాలు పలుకుతున్నారని, ఏవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదా? అని నిలదీశారు.
డిక్లరేషన్ల పేరిట ప్రజలను దగా చేశారు
ఎస్సీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ల పరిస్థితి ఏందో ప్రభుత్వం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, రైతుబీమా, మిషన్ భగీరథ వంటి పథకాలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. మైనారిటీలకు రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితబంధు స్థానంలో రూ. 12 లక్షలు ఇస్తామన్న అంబేదర్ అభయహస్తం హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులు, చేనేత కార్మికులు, యువత, బీసీలు, దళితులు, మైనారిటీలు సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు.
బట్టలు ఊడదీసి కొట్టే రోజు దగ్గర్లోనే ఉన్నది
రేవంత్ గురువు రాహుల్‌గాంధీ ఢిల్లీ నుంచి వచ్చి.. కేసీఆర్, కేటీఆర్ వీరి రెండు ఉద్యోగాలు ఊడగొట్టండి.. రెండు లక్షల ఉద్యోగాలు ఇసా అని అన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఛాత్రోంకి గూంజ్ అని ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని, ఇకడికి వచ్చే ధైర్యం ఆయనకు లేదని విమర్శించారు. ఎందుకంటే హామీలు అమలుచేయనందుకు కాంగ్రెస్ వాళ్లను బట్టలు ఊడదీసి కొట్టే రోజు దగ్గర్లోనే ఉన్నదని హెచ్చరించారు. రేవంత్ కంటే పదిరెట్లు బీజేపీ 2014లో హామీలిచ్చిందని గుర్తుచేశారు. 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నారు మోదీ.. చేశారా? 2022 బుల్లెట్ ట్రైన్ అన్నడు. ప్రతి ఇంటా నల్లా, ప్రతి ఒకరికీ పకా ఇండ్లు అన్నడు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చే స్తా అన్నడు. ఏదీ చెయ్యలే’ అని మండిపడ్డారు.
కేసీఆర్ పాట పెట్టమని ఎవరు చెప్పారు?
గణేశ్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ పాటలు, కేసీఆర్ పాటలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేఖ్లేంగే.. అని ఎందుకు అంటున్నరు.. కేసీఆర్ పాట పెట్టమని ప్రజలకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. గణేశ్ నిమజ్జనం రోజు.. ఎందుకు పాటలు పెట్టి ప్రజలు కేసీఆర్‌ను యాది చేసుకుంటున్నారంటే, కేసీఆర్ వస్తే మళ్లీ తెలంగాణ పట్టాలెకుతది అని అందరూ గుర్తు చేసుకుంటున్నరని తెలిపారు. ఇంకా ఒక సంవత్సరమే టైమ్ ఉన్నదని రేవంత్‌రెడ్డిపై ప్రజలకు నమ్మకం పోయిందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.
నా ఆస్తులన్నీ ఎన్నికల అఫిడవిట్లలో డిక్లేర్ చేసినవే
తన వ్యక్తిగత వ్యాపారాలపై రేవంత్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ కొట్టిపారేశారు. కేసీఆర్ 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రి, డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రిగా పనిచేశారని, నాలుగు దశాబ్దాలకుపైగా చట్టసభల్లో ఉన్నారని గుర్తుచేశారు. తమ కుటుంబానికి తరాల నాటి భూములు ఉన్నాయని స్పష్టంచేశారు. కేసీఆర్ తనను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని చెప్పేవారని, తాను చదువుకుని అమెరికాలో ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో 2006లో కాంగ్రెస్ హయాంలోనే హోటల్ వ్యాపారం ప్రారంభించానని చెప్పారు.
20 ఏండ్లలో అది మూడు అయిందని చెప్పారు. వ్యాపారం మరింత శ్రద్ధపెట్టి ఉంటే మరింతగా పెరిగేదని తెలిపారు. 2006లో రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో హోటల్ ప్రారంభించానని, 2009 ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, వ్యాపార వివరాలను స్పష్టంగా వెల్లడించానని తెలిపారు. ఆ హోటల్ వ్యాపారం వివరాలను అఫిడవిట్లోనే నోటరైజ్ చేసి పారదర్శకంగా ప్రకటించానని తెలిపారు. ‘నేను అఫిడవిట్లో చెప్పిన విషయాన్నే మళ్లీ కొలంబస్ కనుగొన్నట్టు చెబుతున్నరు’ అని అన్నారు. వ్యాపారం చేసుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. తన హోటళ్లకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్‌రెడ్డి తరహాలో తాను మంది మీద పడి దోచుకోలేని స్పష్టంచేశారు.
ఐటీ బ్రాండ్ కేటీఆర్.. లూటీకి బ్రాండ్ రేవంత్
తెలంగాణ ఐటీ బ్రాండ్ కేటీఆర్ అయితే లూటీకి బ్రాండ్ రేవంత్‌రెడ్డి అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. ‘ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ అయితే ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీఆర్’ అని చెప్పారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్ పగటికలలు కంటున్నారని, భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను వేరుచేసే దమ్మున్నదా? రేవంత్ అని ప్రశ్నించారు. ‘పీకడానికి కేసీఆర్ ఏమైనా మొక్క అనుకున్నవా.. మహావృక్షం.. కారుతో ఉం టాం.. సారుతో ఉంటాం.. కేసీఆర్‌తో ఉంటాం’ అని నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీ నుంచి 50 మందికిపైగా నాయకులు తెలంగాణభవన్‌కు వచ్చారని అన్నారు. రెండు జాతీయ పార్టీలకు చెందిన ఆలూరి శ్రీనివాస్‌రెడ్డి, మహేశ్, సత్యనారాయణ, భూషన్, లక్ష్మీనారాయణగౌడ్, నూనె నరేశ్, రేగుళ్ల రజినీకాంత్, గుర్రం అర్జున్‌గౌడ్, సాయన్న, రాకేశ్, శాంతారామ్, నారాయణ, మల్లేశ్, మేకల సంజీవ్, సుధాకర్, మచ్చర్ల సునీత, నరేశ్, దినేశ్, అజీమ్, నదీమ్, నయీమ్ తదితరులు పార్టీలో చేరినట్టు తెలిపారు.
ఖైరతాబాద్ ఉపఎన్నిక అంటే రేవంత్‌కు భయం..
ఖైరతాబాద్ ఉపఎన్నికంటే సీఎం రేవంత్‌రెడ్డి భయపడుతున్నాడని, ఎన్నిక వాయిదా పడాలని కోరుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు. నిజంగా ఆయనకు దమ్ముంటే ఉప ఎన్నికకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికను వాయిదా పడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాడని, కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి పిటిషన్ ఎందుకు వేశారని? ఆయన ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఈ రాష్ర్టానికి ఎంతో చేసినట్టు సిరిసిల్లకు వెళ్లి బిల్డప్ ఇచ్చారని, ఎన్నికలకు వెళ్లి తన బలం నిరూపించుకోవాలని చాలెంజ్ చేశారు. రాష్ట్రంలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, నిజంగా రేవంత్‌రెడ్డికి బలం ఉంటే ఆ వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలిపించి చూపించాలని సవాల్ చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక తాత్కాలికంగా ఆగినప్పటికీ ఉప ఎన్నిక జరుగక తప్పదని, బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నదని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.