Jawahar Nagar | జవహర్‌నగర్, మార్చి 29: ‘సారూ… మా గరీబోళ్ల ఇండ్లు కూల్చితే ఏమోస్తాది? కూలీనాలీ చేసి పస్తులుండి చిన్న రేకుల ఇంటిని నిర్మించుకుని జీవిద్దామనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మా పేదలపైనే ఉగ్రరూపం చూపటం ఏంటి..’ అని జవహర్‌నగర్ వాసులు కన్నీరుమున్నీరయ్యారు. రెక్కల కష్టంతో పనిచేసి నాలుగు గోడలతో రేకులు వేసుకుని చంటిపిల్లలతో పాములు, దోమల మధ్య నివసిస్తుంటే.. ప్రభుత్వం మాపై దయచూపకుండా నిలువనీడలేకుండా చేయడం ఇందిరమ్మ రాజ్యానికే చెల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాప్రా తహసీల్దార్ సుచరిత ఆధ్వర్యంలో జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని అక్రమ కట్టడాల పేరిట పేదల నివాసాలను రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సాయంతో శనివారం కూల్చివేతలు చేపట్టారు. కార్పొరేషన్‌లోని అంబేద్కర్‌నగర్, బీజేఆర్నగర్, సంతోషన్నగర్, లక్ష్మీనర్సింహాస్వామి కమాన్ ఎదురుగా నిర్మించిన కట్టడాలను అక్రమంటూ పోలీసులతో ఇండ్లలో ఉన్న మహిళలను, సామాన్లను బయటకు లాగీ కూల్చివేయడంతో మహిళలు బోరున విలపించారు.
అంబేద్కర్‌నగర్, బీజేఆర్‌నగర్‌లో ఇండ్ల మధ్య ఉన్న రేకుల ఇంటిని కూలగొట్టి స్లాబ్ వేసుకుందామని పిల్లర్లు వేయగా నిర్ధిక్షిణ్యంగా కూల్చివేయడంతో రూ. 5లక్షల మేరకు నష్టపోయామంటూ బాధితులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. జవహర్‌నగర్‌లో 20 ఏండ్ల నుంచి నివసిస్తూ, ఇంటి, నల్లా ట్యాక్సీలు ప్రభుత్వానికి చెల్లిస్తుంటే మా ఇంటి ఎలా కూలగొడతారంటూ రెవెన్యూ యంత్రంగానికి ప్రజలు ప్రశ్నించారు. ‘చిన్నపిల్లలు ఉన్నారు… ఇంటిని కూల్చుతానంటే మేమేలా బతకాలి’ అంటూ ఓ మహిళ పోలీసులను ప్రాధేయపడినా.. వినకుండా ఇంటిని కూల్చివేశారు.
30 ఏండ్ల కిందట..
జవహర్‌నగర్ కార్పొరేషన్లో 30 ఏండ్ల కిందట నిర్మితమైన కాలనీలోకి రెవెన్యూ అధికారులు వెళ్లి అక్రమ నిర్మాణాలంటూ.. కూల్చడంతో బాధితులు ప్రభుత్వంపై మండిపడ్డారు. కరెంటు, ‘వాటర్, ఇంటి పన్నులు చెల్లిస్తున్నాం.. ప్రభుత్వం మాపై కనికరం చూపకుండా కూల్చడం దుర్మార్గం’ అంటూ రోదించారు.
రెక్కల కష్టంపై ఆధారపడి బతికేటోళ్లం
‘రెక్కల కష్టంపై ఆధారపడి బతికేటోళ్లం. చిన్న పిల్లలతో కిరాయి ఇండ్లలో ఎన్నిరోజులు కాలం వెళ్లదీస్తామంటూ చిన్నపాటి రేకుల రూం కట్టుకున్నాం. రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణామంటూ పూర్తిగా నేలమట్టం చేయడంతో దిక్కుతోచని వాళ్లయ్యాం. ’ అని అశ్విని అనే మహిళ కన్నీరుమున్నీరయ్యారు. పిల్లలతో కలిసి ఎక్కడ నివాసముండాలని కన్నీరు పెట్టడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది.