Himayat Sagar | హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హిమాయత్ సాగర్‌కు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ వరద పోటెత్తడంతో.. నిన్న రాత్రి 10 గంటలకు ఒక గేటును ఎత్తారు. తాజాగా ఇవాళ ఉదయం 10 గంటలకు మరో మూడు గేట్లను ఎత్తేశారు. మొత్తం 17 గేట్లలో ఇప్పటి వరకు 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
దీంతో మూసీ నదికి వరద పోటెత్తింది. వరద నీటితో మూసీకి జలకళ వచ్చింది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు, పోలీసులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.5 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1763.1 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1044 క్యూసెక్కులుగా ఉంది. తాజాగా ఎత్తిన మూడు గేట్లను కూడా ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.