Himayat Sagar | హైదరాబాద్ : కుండపోత వర్షాలకు జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో గేట్లు ఎత్తేశారు. ఉస్మాన్ సాగర్ 4 గేట్లు 3 ఫీట్ల మేర, హిమాయత్ సాగర్ 3 గేట్లు 4 ఫీట్ల మేర ఎత్తి వరద నీటిని మూసీలోకి వదిలారు అధికారులు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.
ఉస్మాన్ సాగర్ పూర్తి నీటిమట్టం 1790 ఫీట్లు కాగా, ప్రస్తుతం 1789.50 ఫీట్లకు వరద నీరు చేరుకుంది. హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.50 ఫీట్లు కాగా, ప్రస్తుతం 1763.20 ఫీట్లకు వరద నీరు చేరుకుంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జంట జలాశయాలకు ఇంకా వరద నీరు పోటెత్తే అవకాశం ఉంది.