Hyderabad | వెంగళరావునగర్, మే 14 : డబ్బుల కోసం వివాహ వేడుకలో హిజ్రాలు అసభ్యకరంగా ప్రవర్తించి న్యూసెన్స్‌కు పాల్పడ్డ ఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం రహ్మత్ నగర్ అమర్ పాయింట్ లైన్లో ఓ వివాహ వేడుకలు జరుగుతున్నాయి.
ఇంటి ముందు పెళ్లి పందిరి చూసి బోరబండకు చెందిన హిజ్రాలు హీనా(21), రిషిక(19 ) ఆ ఇంట్లోకి ప్రవేశించారు. కాబోయే పెండ్లి కూతురికి బొట్టు పెట్టి ఇంటి బయట ఒక గుర్తు పెట్టి మళ్ళీ తాము రేపు వస్తాం.. రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం అక్కడికి చేరుకుని రూ.30 వేలు డిమాండ్ చేశారు. రూ.3 వేలు ఇస్తామని చెప్పినా వినకుండా గొడవకు దిగి అసభ్యకర చేష్టలకు పాల్పడడంతో మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి కూతురు సోదరుడు కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలరాజ్ తెలిపారు.