హైదరాబాద్ : తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి పీవీ నరసింహారావు (PV Narasimha Rao) అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) అన్నారు. పీవీకి కేంద్రం భారత రత్న(Bharat Ratna) అవార్డు ఇవ్వడం తెలుగు ప్రజలందరికీ గర్వ కారణమని హర్షం వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ భారత ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పలుమార్లు కేంద్రాన్ని కోరడమే కాకుండా తెలంగాణ అసెంబ్లీ లో ఏకగ్రీవ తీర్మానం చేశారని గుర్తు చేశారు.
పీవీ గౌరవార్థం ట్యాంక్ బండ్ పై విగ్రహాన్ని ప్రతిష్టించి జయంతి, వర్దంతిని అధికారికంగా నిర్వహించిందని పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్ ను పీవీ మార్గ్ (PV Marg) గా మార్పు, అసెంబ్లీ లాబీ హాల్ లో ఆయన చిత్రపటాన్ని పెట్టారని వెల్లడించారు. పీవీ కూతురు వాణిదేవికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి సమున్నత గౌరవం బీఆర్ఎస్ ఇచ్చిందని అన్నారు. ఏడాది పాటు పీవీ శత జయంతి ఉత్సవాలను నిర్వహించిందని ఆయన అన్నారు. పీవీకి భారత రత్న కోసం కృషి చేసిన కేసీఆర్, భారత రత్న ప్రకటించిన కేంద్రానికి ఎమ్మెల్యే పల్లా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.