మణికొండ/ శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 18 : న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించిన కేసులో రాజేంద్రనగర్ ఆర్డీవో కె.వెంకట్‌రెడ్డికి నెలరోజుల సాధారణ జైలు శిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి ఉత్తర్వులు వెలువరించారు. శంషాబాద్ మండ లం పెద్దషాపూర్ గ్రామంలోని 74 ఎకరాల భూమికి సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదంపై న్యాయస్థానం అందించిన ఆదేశాలను ఆర్డీవో బేఖతారు చేశారని విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా ఆర్డీవో వెంకట్‌రెడ్డి ప్రవర్తనను తీవ్రం గా పరిగణించి వివాదంపై నిష్పాక్షికంగా, న్యాయంగా పరిష్కారం జరిగేలా చూడటానికి ఈ విషయాన్ని అతని నుంచి ఉపసంహరించుకుని సమర్థుడైన మరో ఆర్డీవోకు అప్పగించాలని న్యాయమూర్తి.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించారు.
పిటిషనర్ నవాబ్మోండ్ యూసుఫుద్దీన్ ఖాన్, ఆ ఆస్తి ప్రైవేటు పట్టా భూమి అని చెప్పినప్పటికీ ఈ వివాదం 1977 నాటిదని, అప్పుడు, భూ సంస్కరణల ట్రిబ్యూనల్ దానిని సీలింగ్ భూమిగా వర్గీకరించింది. సివిల్ కోర్డుల్లో విచారణ జరిగిన తర్వాత , తాజా నిర్ణయం కోసం ఈ విషయాన్ని ట్రిబ్యునల్‌కు తిరిగి పంపించారు. భూ సంస్కరణల ట్రిబ్యునల్ అధికారి హోదాలో వ్యవహరిస్తున్న ఆర్డీవో 2024లో ఈ విషయాన్ని తీర్పు నిమిత్తం రిజర్వు చేసిన తర్వాత దానిని నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించడంలో విఫలమవ్వడంతో ప్ర స్తుతం న్యాయ వివాదం మొదలైంది.
ఈ జాప్యాన్ని సవాలు చేస్తూ బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇం దుకు స్పందించిన న్యాయస్థానం.. ఫిబ్రవరి 2025లో ఆరువారాల్లోగా తగిన ఉత్తర్వులు జారీచేయాలని ఆర్డ్డీవో వెంకట్‌రెడ్డిని ఆదేశించింది. అయినా ఆ అధికారి ఆదేశాలను పాటించకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు స్పందించిన న్యా యస్థానం.. కోర్టు ధిక్కరణ నోటీసులు అంది న తర్వాత కూడా 2026 ఫిబ్రవరిలో హాజరు కావాలని సమన్లు జారీచేసే వరకు ఆర్డీవో స్పందించలేదు. కోర్టు సమన్లు జారీ చేసిన తర్వాత అతను ఈ వివాదంపై ఉత్తర్వు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని హైకోర్టు గుర్తించింది. ఆర్డీవో ఉత్తర్వులో సరైన కారణాలు లేవని, అందులోని నిర్ధారణలు పొంతన లేకుండా ఉన్నాయని, అవి ప్రస్తుతం ఉన్న రికార్డులకు విరుద్ధంగా ఉన్నాయని న్యాయమూర్తి తేల్చారు. విషయాన్ని పునః పరిశీలన కోసం అధికార సంస్థకు పంపినప్పుడు, ఆర్డీవో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు నిర్థారించే ముందు వాస్తవాలను పరిగణలోకి తీసుకుని విచారించాలని కోర్టు పేర్కొంది. కోర్టు ధిక్కరణలో భాగంగా హైకోర్టు నెలరోజుల సాధారణ జైలు శిక్షతో రూ.2వేల జరిమానా అనుభవించేందుకు హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్-1) ఎదుట లొంగిపోవాలని ఆర్డీవోను ఆదేశించింది. అయితే రెండు వారాల్లో సరైన సంజాయిషీతో పాటు అప్పిల్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.