సిటీబ్యూరో, శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక.. అక్రమార్కులు అడ్డూ అదు పు లేకుండా పోతున్నది. ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు.. క్షణాల్లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టిస్తూ కబ్జాకు పాల్పడుతున్నారు. శంషాబాద్‌లోని రూ.10వేల కోట్ల విలువైన 50 ఎకరాలను కబ్జా చేసేందుకు పన్నాగం వేశారు. శంషాబాద్ పట్టణంలోని హెచ్ఎండీఏకి చెందిన 50 ఎకరాల భూమిని మలక్‌పేటకు చెందిన యహియా ఖురేషీ, వట్టెపల్లికి చెందిన మహ్మద్ మొయినుద్దీన్ గతంలోనే కబ్జా చేసేందుకు ప్రయత్నించగా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.
వారు సృష్టించినవన్నీ తప్పుడు డాక్యుమెంట్లని ఆధారాలతో సహా చూపించి ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఓ ఎమ్మెల్యే బంధువు సహాయంతో ఈ సారి మళ్లీ దొంగ పత్రాలు సృష్టించి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ భూమి తమదేనంటూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు మరోసారి కుట్రకు తెరలేపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువు అండదండలతో ఖరీదైన 50 ఎకరాల ప్రభుత్వ భూ మిని కాజేసేందుకు పన్నాగం వేశారు. ఈసారి వారి మెడలు వంచిన హైకోర్టు.. సమగ్ర దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సమగ్ర విచారణకు ఆదేశం
కబ్జాకోరులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిలువరించడంతో కాంగ్రెస్ నేతల అండదండలతో రూ. కోట్లు విలువ చేసే భూములను ఎలాగైనా తమ సొంతం చేసుకోవాలని భావించారు. దాదా పు 50 ఎకరాలకు పైగా ప్రహరీ నిర్మించి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ భూమి యహి యా ఖురేషీ, మహ్మద్ మొయినుద్దీన్‌కు చెందినదిగా బోర్డులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈసా రి ఎమ్మెల్యే బంధువు సహకారంతో 2024 డిసెంబర్ 9న కోర్టు ఆ భూములు తమకే చెందినవిగా ఆర్డర్ ఇచ్చిన్నట్లు పేర్కొన్నారు. ఆ నకిలీ పత్రాలతో మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ వ్యవహారంపై శుక్రవారం హైకోర్టులో విచారణకు రావడంతో న్యాయమూర్తి పిటిషినర్లు కోర్టుకు సమర్పించిన నివేదిక పూర్తిగా తప్పు ఉన్నట్లు గుర్తించారు. హెచ్ఎండీఏ భూములపై సమగ్ర విచారణ చేపట్టేందుకు సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కోర్టును పదేపదే తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్న వారిపై చార్మినార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.
తప్పుడు ధ్రువపత్రాలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ట్రక్ టెర్మినల్ నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం శంషాబాద్ పట్టణంలోని 724,725 సర్వే నంబర్లలో 214.02 ఎకరాల భూ మిని కేటాయించింది. అప్పట్లోనే అవార్డు( నం.1/ 1990. ఫైల్ నంబర్ ఐఏ84/86) ను కూడా జారీ చేసింది. కానీ సర్వే నంబర్ 725/21లో 7.7 ఎకరాలు, సర్వే నంబర్ 725/23లో 10.7 ఎకరాలు సర్వే నంబర్ 725/24లో 12. 34 ఎకరాలతో పా టు పాటు మరికొన్ని సర్వే నంబర్లలో సుమారు 50 ఎకరాల భూమిని తమ పూర్వీకులు (పైగా అథారిటీ) నుంచి వేలంలో కొనుగోలు చేశారని పేర్కొం టూ..
ఫలక్‌నుమాకు చెందిన యహియా ఖురేషీ, వట్టెపల్లికి చెందిన మహ్మద్ మొయినుద్దీన్ హైకోర్టులో రెండు వ్యాజ్యాలను దాఖలు చేశారు. వాటిలోని అంశాలను నిజాం ఆస్తుల వివాదం మూలాలకు సంబంధించినవిగా కోర్టు భావించింది.ఆ పిటిషన్లకు సీఎస్-7బ్యాచ్ కేసులుగా పిలిచే పిటిషన్లుతో జతచేసి హైకోర్టు ప్రధాన న్యామూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసి సమాచారం పూర్తిగా తప్పుగా భావించింది. కోర్టుకు దాఖలు చేసిన వివరాలు అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించింది. కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చినా… ఎలాగైనా ఆ భూములను దక్కించుకోవాలని ఈసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువు సహకారంతో మళ్లీ పిటిషన్ వేసి భంగపడ్డారు.