సిటీబ్యూరో: రాత్రి 8 గంటలకే నగరంలోకి భారీ వాహనాలు ఎంట్రీ ఇస్తున్నాయి. సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో భాగంగా రాత్రి 10 గంటల తరువాతే భారీ వాహనాలకు అనుమతి ఉంది. అయితే ట్రాఫిక్ పోలీసులు రాత్రి 8 గంటల వరకే రోడ్లపై ఉండడంతో భారీ వాహనాలు సిటీలోకి ప్రవేశిస్తున్నాయి.
సిటీలోకి భారీ వాహనాలు వస్తే, చలాన్లు వేయడంతో పాటు రాత్రి 10 గంటల వరకు సమీపంలోని ఓపెన్ ప్లేస్లో ఆ వాహనాలను ఆపుతామంటూ గతంలో ఉన్నతాధికారులు ప్రణాళికలు చేశారు. వారం రోజుల పాటు రాత్రి వేళల్లో భారీ వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా రాకుండా కట్టడి చేసినట్లు క్షేత్ర స్థాయిలోని పోలీసులు చర్యలు తీసుకొని ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారనే విమర్శలొస్తున్నాయి. ఇంకేముంది రాత్రి 8 తరువాత అసలు ట్రాఫిక్కు, భారీ వాహనాలు కూడా తోడవ్వడంతో రద్దీ ఏర్పడుతున్నది.
లారీలు, ప్రైవేట్ బస్సులు రాత్రి 10 గంటల వరకు నగరంలోకి ప్రవేశానికి అనుమతి లేదు. అయితే చాలా వరకు ప్రైవేటు బస్సులు నిబంధనలు ఉల్లంఘిస్తూ రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలోనే నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ విషయంపై కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు రాసినా.. భారీ వాహనదారులు ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు.