సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఒక పక్క సాధారణ ట్రాఫిక్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు.. మరోపక్క యూ టర్న్‌ల వద్ద చుక్కలు కన్పిస్తున్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ సమస్య రోజు రోజుకు జఠిలమవుతున్నది. ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు గతంలో నగరంలో చాలాచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్‌ను తగ్గించి యూ టర్న్‌లను ఏర్పాటు చేశారు. ఈ టర్న్‌లతో హైదరాబాద్‌తో పాటు రాచకొండ, సైబరాబాద్‌లో ట్రాఫిక్ చాలాచోట్ల ఆగకుండా ముందుకు సాగుతూ వెళ్లింది. అప్పట్లో ప్రధాన రహదారుల్లోనే కాకుండా అంతర్గత రోడ్లలోనూ యూ టర్న్‌లు ఏర్పాటు చేశారు.
ఒకచోట పదేండ్లు.. మరోచోట ఐదేండ్లు.. ఇంకోచోట మూడేండ్ల క్రితం ఇలా ఈ యూటర్న్లు అప్పటి పరిస్థితులను అంచనా వేస్తూ ఏర్పాటు చేశారు. అయితే పెరుగుతున్న వాహనాలు, శివారు ప్రాంతాలలో పెరుగుతున్న కాలనీలు, నగరానికి జీవనోపాధి కోసం వస్తున్న వారి సంఖ్య ప్రతి యేడు లక్షల్లో పెరుగుతూ వస్తోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాల్సిన జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు ఆ విషయాన్ని విస్మరించాయంటూ సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాఫీగా ట్రాఫిక్ వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఈ యూటర్న్లు.. నేడు పర్యవేక్షణ కొరవడటంతో ట్రాఫిక్ రద్దీకి ఒక కారణంగా మారుతున్నాయంటూ వాహనదారులు వాపోతున్నారు.
రోడ్డుపై సాఫీగా వెళ్లే వాహనాలు యూ టర్న్ తీసుకునే వాహనాలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యూ టర్న్‌లు తీసుకునే వాహనదారులు తమ వాహనాలను మలుపు తీసుకోవడానికి రోడ్డుపై ఇష్టానుసారంగా ఆపేస్తుండటంతో వెనుక నుంచి నేరుగా వెళ్లాల్సిన వాహనాలు సైతం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో తక్కువ సంఖ్యలో వాహనాలు ఉండటంతో సాఫీగా యూ టర్న్‌ల వద్ద మలుపు తిరిగేవి, నేడు ఆ పరిస్థితులు లేవు. వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడం, శివారు ప్రాంతాలకు వచ్చిపోయే వారి సంఖ్య కూడా పెరగడంతో రోజు రోజుకు సమస్య తీవ్ర మవుతున్నది. యూటర్న్ల వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ఉండేలా ట్రాఫిక్ పోలీస్, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.
హైదరాబాద్ ఇన్నర్ రింగ్‌రోడ్డు ఇప్పుడు నగరంలో ప్రధాన రహదారులలో ఒకటిగా మారింది. నగరంలోని చాలా కీలకమైన ప్రాంతాలను కలుపుతూ ఈ రోడ్డు వెళ్తోంది. బెంగుళూర్, మెహిదీపట్నం, ఆరంఘర్ చౌరస్తా, మైలార్‌దేవ్‌పల్లి, చంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్ ఇలా అన్ని ప్రాంతాలను కలుపుకుంటూ ఈ రోడ్డు ఉంటుంది. అయితే నగరం విస్తరించడంతో ఈ రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర నూతనంగా కాలనీలు వెలిశాయి. అలాగే ఈ రోడ్డుకు ఒక పక్క ఇండస్ట్రియల్ ఏరియాలు కూడా ఉన్నాయి.
దీంతో ఈ రోడ్డుపై విపరీతమైన రద్దీ ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కార్యాలయాలకు వచ్చీపోయే సమయంలో ట్రాఫిక్ భారీగా ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కల్గకుండా చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే కేవలం కొన్ని కూడళ్లలో మాత్రమే ట్రాఫిక్ పోలీసుల బందోబస్తు ఉండడంతో ట్రాఫిక్ సాఫీగానే ముందుకు కదులుతోంది. రాచకొండలోని మంద మల్లమ్మ ఫంక్షన్ హాల్, గాయిత్రినగర్, నాగోల్ మెట్రో, ఉప్పల్‌తో పాటు సైబరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ , ఐటీ కారిడార్, హైదరాబాద్‌లోని బేగంపేట తదితర ప్రాంతాలలో ఈ సమస్య జఠిలంగా మారుతున్నది. ఆయా యూటర్న్ల వద్ద భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది.
పనిదినాలలోనే కాకుండా ఆదివారం, ఇతర సెలవు రోజుల్లోనూ ఈ సమస్య ఎక్కువగానే ఉంది. యూటర్న్ల వద్ద వాహనాలు టర్న్ తీసుకోవాలంటే కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించే పనులను విస్మరించడమేననే ఆరోపణలు వస్తున్నాయి. ఇన్నర్ రింగ్‌రోడ్డుపై మధ్యాహ్నం సమయంలో భారీ వాహనాలు తిరుగుతుంటాయి, ఆయా వాహనాలు మలుపు తీసుకునే సమయంలో ఎక్కువ సమయం పడుతుండటంతో ఇతర వాహనదారులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు ఏర్పాటు చేసిన యూటర్న్లు ఇప్పుడు ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.