బంజారాహిల్స్, అక్టోబర్ 26 : అధికారం అండతో ఆ పార్టీ నేతలు అడ్డూఅదుపు లేకుండా వ్యవహరిస్తున్న తీరు నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నది. ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ సందర్భంగా తీసిన భారీ ర్యాలీతో జూబ్లీహిల్స్ నియోజకవర్గమే గాక పక్క రోడ్లన్నీ గంటలకొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి వాహనదారులు నరకం చూడాల్సి వచ్చింది. అదే తీరుగా ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నడిరోడ్డుపై కాన్వాయ్ ఆపి ముచ్చట్లు పెట్టి మళ్లీ ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారు.
రహ్మత్‌నగర్ డివిజన్ శ్రీరాంనగర్‌లో ప్రచారానికి వచ్చిన మంత్రితో పాటు అభ్యర్థి నవీన్ యాదవ్ గంట పాటు సభ నిర్వహించారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో కోమటిరెడ్డి నడిరోడ్డుమీద 20 నిమిషాలు ముచ్చటించారు. కాన్వాయ్ రోడ్డు మీద ఆగిపోవడంతో రెండు వైపులా భారీ ట్రాఫిక్‌జామ్ కోరగా మంత్రి కోమటిరెడ్డి తన అనుచరులతో కలిసి నడిరోడ్డుమీద నిలబడి సుమారు 20 నిమిషాలు ముచ్చటించారు. అప్పటికే ఆయన కాన్వాయ్‌లోని పలు వాహనాలు రోడ్డు మీద ఆగిపోవడంతో రోడ్డుకు రెండు వైపులా భారీ ట్రాఫిక్‌జామ్ అయ్యింది. అసలే ఇరుకుగా ఉన్న శ్రీరాంనగర్ ప్రధాన రహదారిపై సుమారు కిలోమీటర్ మేర ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు, బైక్‌లు చిక్కుకుపోవడంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నడిరోడ్డుపై ఇలా ఆపడమేంటని ఓ వ్యక్తి అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఆఫీసులకు వెళ్లే సమయంలో నడిరోడ్డుపై ట్రాఫిక్ ఆపేస్తే ఎలా అంటూ మరికొంతమంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ హారన్లు మోగించారు. అంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించకపోవడంపై జనం మండిపడ్డారు. మంత్రి మాత్రం మీడియాతో తాపీగా ముచ్చట్లు పెట్టి వెళ్లిపోయారు. కానీ ట్రాఫిక్ క్లియర్ కావడానికి సుమారు 45 నిమిషాలు పట్టింది.