సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో నగరం అతలాకుతలమైంది. దీనికి తోడు రాఖీ పండుగ కావడంతో ప్రజలు రోజువారీ కంటే ఎక్కువ సంఖ్యలో బయటకు వచ్చారు. దీంతో నగరం ట్రాఫిక్‌తో అష్టదిగ్భందనంగా మారింది. ఎటు చూసినా రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి.
ఓ పక్క వాన, మరో పక్క స్తంభించిన ట్రాఫిక్‌తో వాహనదారులు నరకయాతన పడ్డారు. చాలా చోట్ల ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు కనిపించలేదు. కొన్ని జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఉన్నా.. వారు సిగ్నల్స్‌ను వేయడానికి లేదా ఫొటోలు తీయడానికే పరిమితమయ్యారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు పనిచేసిన దాఖలాలు కనిపించలేదు.
టోలీచౌకి, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, బంజారాహిల్స్, జీవీకే, పంజాగుట్ట, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మైండ్ స్పేస్ జంక్షన్, కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, బేగంపేట, రసూల్‌పురా, ప్యారడైజ్, ప్యాట్నీ, సంగీత్, మెట్టుగూడ, హబ్సిగూడ, తార్నాక, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే ఉండటంతో చుక్కలు కనపడ్డాయి. అధికారులు త్వరితగతిన ట్రాఫిక్‌ను క్లియర్ చేయకపోవడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో సోమవారం మధ్యా హ్నం నుంచి గ్రేటర్ వ్యాప్తంగా పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరదనీరు నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్గింది. రాత్రి 9.30గంటల వరకు షేక్‌పేట, యూసుఫ్‌గూడలో అత్యధికంగా 5.45 సెం.మీ, గచ్చిబౌలిలో 5.25 సెం.మీ,ఫిల్మ్‌నగర్‌లో 4.93 సెం.మీ, బాలానగర్, జూబ్లీహిల్స్‌లో 4.60 సెం.మీ, వెస్ట్ మారెడ్‌పల్లి, కుత్బుల్లాపూర్ గాయత్రీనగర్‌లో 4.10 సెం.మీ, లంగర్‌హౌస్, వెంగళరావునగర్,
రహ్మత్నగర్లలో 3.58 సెం.మీ, రామచంద్రాపురం, రాజేంద్రనగర్‌లో 2.90 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు గ్రేటర్లో తేలికపాటి నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.9డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.8డిగ్రీలు, గాలిలో తేమ 91శాతంగా నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.