Traffic Jam | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. వరద నీటి కారణంగా వాహనాలు ముందుకు కదలడం లేదు. వర్షం తగ్గినప్పటికీ పలు చోట్ల వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
ఐటీ కారిడార్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. మోకాలి లోతు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్టలో నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. కొండాపూర్, బేగంపేట, సికింద్రాబాద్ మార్గాల్లో కూడా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మూసీ ఉధృతి కారణంగా అంబర్పేట్ – ముసారాంబాగ్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు.