Traffic Jam | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మియాపూర్ నుంచి కొండాపూర్ మార్గంలో హఫీజ్‌పేట్ వద్ద వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కేపీహెచ్‌బీ నుంచి హైటెక్ సిటీ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. షేక్‌పేట నుంచి గచ్చిబౌలి, బయో డైవర్సిటీ మార్గంలో కూడా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక హయత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. భాగ్యలత నుంచి హయత్‌నగర్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
ట్రాఫిక్‌జామ్ కారణంగా అటు విద్యార్థులకు, ఇటు ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. సకాలంలో కార్యాలయాలకు, కాలేజీలకు చేరుకోలేకపోతున్నామని విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రయాణికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.