మలక్పేట, మార్చి 2: మలక్ పేట నల్గొండ చౌరస్తా వద్ద ఆదివారం ఉదయం 11 గంటలకు భారీగా ట్రాఫిక్ జామ్(Heavy traffic jam)అయింది. జాతీయ రహదారిపై నల్గొండ చౌరస్తా నుంచి దిల్ సుఖ్ నగర్, సైదాబాద్ లవైపు వెళ్లే జంక్షన్ వద్ద జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో డ్రైనేజీ మ్యాన్ హోల్ కు మరమ్మతులు చేపట్టడంతో రోడ్డు ఇరుకుగా మారి ట్రాఫిక్ స్తంభించిపోయింది.
గంటసేపు డ్రైనేజీ పనులు కొనసాగడంతో రెండువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రంగ ప్రవేశం చేసిన ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ముందస్తు ప్రణాళిక లేకుండా పనులు చేపట్టడంతో గంటసేపు వాహన చోదకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు ఆఫీసులకు వెళ్లే సమయాల్లో కాకుండా ఇతర సమయాల్లో పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.