Traffic Jam | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోమాజిగూడ, రాజ్‌భవన్ రోడ్డు, లక్డీకాపూల్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, సచివాలయం మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
ట్రాఫిక్ జామ్‌కు కారణం ఏంటంటే.. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఏరియాలో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. భక్తుల వాహనాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం లేకపోవడం మరింత ఇబ్బందికరంగా మారింది. ఖైరతాబాద్ గణనాథుడిని ఇప్పటి వరకు 12 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
నిమజ్జన ప్రక్రియకు సమయం సమీపిస్తుండడంతో.. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇక రేపట్నుంచి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.