ఆర్కే పురం, జూన్ 1: హైదరాబాద్ సరూర్‌నగర్ రైతు బజార్ అక్రమాలకు అడ్డాగా మారింది. ఎడాపెడా అధిక ధరలతో దోచేస్తున్నారు. దీనిపై కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నప్పటికీ మార్కెటింగ్ అధికారుల నుంచి స్పందన రావడం లేదు. ఎస్టేట్ అధికారి ఎప్పుడొస్తారో, సిబ్బంది ఎక్కడ సేద తీరుతారో తెలియని పరిస్థితుల్లో దుకాణ నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. షాపు నిర్వాహకులపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా నిర్వాహకుల్లో మార్పు రావడం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సరూర్‌నగర్ రైతు బజార్‌కు ఎల్బీనగర్, హబ్సిగూడ, తార్నాక నుంచి వినియోగదారులు వస్తుంటారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల వరకు దుకాణాల వద్ద బోర్డులపై నిర్దేశించిన ధరలు రాయాలి. కానీ తాపీగా ధరల పట్టికను సూచించడమే కాకుండా కొన్ని దుకాణాల్లో బోర్డుపై ఉన్న ధరలకు వసూలు చేసే మొత్తానికి సంబంధం ఉండడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. రైతుల కంటే ఎక్కువమంది వ్యాపారులే ఉండడంతో ధరలు ఇష్టారాజంగా వసూలు చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా బోర్డుపై ఉన్న ధరలకు అమ్మడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారి స్పందించి బోర్డుపై ఉన్న ధరలకు కూరగాయలు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కాగా, అధిక ధరలకు కూరగాయలు అమ్మేవారిపై చర్యలు తీసుకుంటున్నామని ఎస్టేట్ అధికారి స్రవంతి తెలిపారు. ఫిర్యాదులు పరిశీలించి, అధిక ధరలు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పద్ధతి మార్చుకో పోతే దుకాణాల నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. ఎవరైనా సరే బోర్డు మీద ఉన్న ధరలకే కూరగాయలను అమ్మాలని స్పష్టం చేశారు.