సిటీబ్యూరో, జూన్ 17(నమస్తే తెలంగాణ): నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా కురిసిన వర్షం దాటికి విద్యుత్ వ్యవస్థ అతలాకుతలమైంది. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో మొదలైన వర్షంతో భారీ చెట్లు, వాటి కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయంది. బల్కంపేట, బీకే గూడలో 3.30 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, రాత్రి 8.30 గంటలు దాటినా పునరుద్ధరణ చేయలేదు.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్‌లో తొమ్మిది సర్కిళ్లు ఉండగా, అందులో రాజేంద్రనగర్, సరూర్నగర్లు మినహా మిగతా ఏడు సర్కిళ్లలో చాలా చోట్ల విద్యుత్ తీగలపై చెట్లు, వాటి కొమ్మలు పడి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రధానంగా బంజారాహిల్స్ సర్కిల్ పరిధిలోని మధురానగర్, బీకే గూడ, మోతీనగర్, కళ్యాణ్‌నగర్ ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కాలనీల్లో అంధకారం నెలకొంది. గంటల తరబడి విద్యుత్ సరఫరా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా చోట్ల చెట్లు, వాటి కొమ్మలే విద్యుత్ లైన్లపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు వివరణ ఇచ్చారు.
భారీ వర్షానికి నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు. చెట్లు, వాటి కొమ్మలు విద్యుత్ తీగలపైన కాకుండా సబ్ స్టేషన్ నుంచి వచ్చే ఫీడర్, ట్రాన్స్ఫార్మర్స్పై పడటంతో వాటిని తొలగించేందుకు గంటల సమయం పట్టింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురై ఫిర్యాదులు చేశారు.
కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకూడంతో వాటిని జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలతో కలిసి విద్యుత్ శాఖ అధికారులు తొలగించేందుకు ఎక్కువ సమయం పట్టిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈదురు గాలులతో వర్షం కురిసినప్పుల్లా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం తలెత్తి, గంటల తరబడి కరెంట్ రావడం లేదని బల్కంపేటకు చెందిన కళ్యాణ్ వాపోయారు. ఇలా సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దాన్ని పునరుద్ధరించేందుకు కొన్ని చోట్ల 4-5 గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు.