Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం వాన దంచికొట్టింది. సుమారు అర గంటకు పైగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి వరద పోటెత్తింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో ఖైరతాబాద్ – పంజాగుట్ట మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు తాజ్ కృష్ణా వైపు వాహనాలను మళ్లిస్తున్నారు. ఖైరతాబాద్‌లో మెర్క్యూరి హోటల్ వద్ద కారుపై ఓ చెట్టు కూలింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు.