Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులన్నీ కూడా వరద నీటితో చెరువులను తలపించాయి. ముఖ్యంగా నగర శివార్లలోని హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. రామోజీ ఫిల్మ్ సిటీ ఏరియాలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది.
ఇక ఎల్బీనగర్, భాగ్యలత, వనస్థలిపురం ఏరియాల్లోనూ వాన దంచికొట్టింది. ఈ భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో హైదరాబాద్ – విజయవాడ హైవేపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో వాహనాలు నెమ్మెదిగా కదులుతున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
హయత్‌నగర్, వనస్థలిపురం, కుంట్లూరు ఏరియాల్లో సాయంత్రం 4 గంటల వరకు 100 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఎల్బీనగర్, నాగోల్, బోడుప్పల్, నాచారం, మల్లాపూర్, కాప్రా, మౌలాలి, ఈసీఐఎల్, నాగారంలో మోస్తరు వర్షం కురిసింది. మరో గంటలో నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.