వర్షం పడుతుందని ప్రకటనలిచ్చిన బల్దియా వర్షం పడినతర్వాత అడ్రస్ లేదు. కూల్చేందుకు ఆగమేఘాల మీద వాలిపోయే హైడ్రా.. వర్షం పరిస్థితిని చక్కదిద్దేందుకు మాత్రం ముందుకు రాలేదు. హోరున వాన పడితే జంక్షన్లలో ఎక్కడో ఒక చోట తప్పితే ట్రాఫిక్‌ను సరిదిద్దేందుకు సిబ్బందే లేరు. కిలోమీటరు ప్రయాణానికి ఐటీ కారిడార్‌లో రెండు గంటల సమయం పట్టింది. షేక్‌పేట పరిధిలో నాలాలు ఉప్పొంగి ఏకంగా ప్రధాన రహదారులను ముంచెత్తాయి. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లి దారులన్నింటినీ దిగ్బంధించేశాయి. వెరసి నగరంలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ సమన్వయం లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించి నగరాన్ని గురువారం రాత్రంతా వరదపాలు చేశారు.
సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంపై వరుణుడు ఉగ్రరూపం చూపాడు. గురువారం సాయంత్రం ఆకాశానికి చిల్లు పడిందా..! అన్నట్లు దాదాపు రెండు గంటలకు పైగా ఏకధాటిగా కురిసిన జోరు వర్షానికి గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలమైంది. రహదారులు చెరువులను తలపించాయి..మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి..అపార్ట్మెంట్ల సెల్లార్లు చెరువుల్లా మారాయి. వరద ఉప్పెనలా పోటెత్తడంతో అమీర్‌పేటలో కార్లు నీటిపై తేలియాడాయి. మరికొన్ని చోట్ల బైక్‌లు, ఆటోలు నీట మునిగాయి.
ఈ క్రమంలోనే వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల్లోకి నీరు చేరి చాలా వరకు బండ్లు మొరాయించాయి. ఇండ్లు, షాపుల్లోకి నీరు చేరి తీవ్ర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఇండ్లలోకి చేరిన నీటిని బయటికి ఎత్తివేస్తూ వారి పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా రోడ్లపై మోకాల్లోతు వర్షపు నీరు నిలిచి ముఖ్యమైన ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ప్రత్యక్ష నరకాన్ని చవి చూశారు. వాతావరణ శాఖ నుంచి ఎప్పటికప్పుడు అలర్ట్ వచ్చినప్పటికీ అధికార యంత్రాంగం అప్రమత్తత ప్రదర్శించకపోవడంతో వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని చూశారు.
ఎక్కడికక్కడే స్తంభించిన ట్రాఫిక్..
భారీ వర్షానికి ఎక్కడికక్కడే వాహనాలు స్తంభించాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఒక వైపు భారీ వర్షం.. మరో వైపు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో నగర వాసులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి రెండు మూడు గంటల సమయం పట్టింది. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, బంజారాహిల్స్, బయోడైవర్సిటీ, కేబుల్ బ్రిడ్జి, ఐకియా జంక్షన్, రాయదుర్గం, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, సోమాజిగూడ, ఖైరతాబాద్, అమీర్‌పేట, మెహిదీపట్నం, గోల్కొండ, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బేగంపేట, సికింద్రాబాద్, మెట్టుగూడ, తార్నాక, మలక్‌పేట, చాదర్‌ఘాట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. భారీ వర్షానికి మెట్రో స్టేషన్లు, మెట్రో లైన్ కింద వాహనదారులు గంటల తరబడి తలదాచుకున్నారు.
రాత్రి వరకు ట్రాఫిక్ జంఝాటం..
గ్రేటర్లో అత్యధికంగా ఖాజాగూడలో 12.5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయింది. మాదాపూర్, హైటెక్ సిటీ, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోలీచౌకి నుంచి మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ వైపు రోడ్డు పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది. పంజాగుట్ట నుంచి అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్‌సిటీ వైపుకోఠి నుంచి సీబీఎస్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, నల్గొండ ఎక్స్‌రోడ్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, ఎల్బీనగర్ వరకు ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు.
గచ్చిబౌలి-మియాపూర్ రోడ్‌లోని హఫీజ్‌పేట ఫ్లైఓవర్‌పై భారీగా వరద నీరు చేయడంతో అధికారులు నీటిని మోటార్ల సాయంతో తోడేశారు. ప్యాట్నీ నాలా ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల పరిసర కాలనీలన్నీ నీట మునిగిపోయాయి. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ప్రభావంతో కృష్ణానగర్ నీటమునిగింది. వాహనాలు చిక్కుకుపోయి ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కేసీపీ జంక్షన్ వద్ద భారీగా వరద నీరు చేరింది.
ముంచెత్తిన వరద
నగరాన్ని ఉప్పెనలా వచ్చిన వరద ముంచెత్తింది. కాలనీలు, బస్తీలు అని తేడా లేకుండా భారీ వరదతో అటు వాహనదారులు, ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. జోరు వానకు ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్లపై మోకాలు లోతు నీరు నిలవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మొన్న కొత్త గూడ, నేడు హఫిజ్పేట ఫ్లై ఓవర్‌పై భారీగా వరద నీరు నిలిచింది. గచ్చిబౌలి-మియాపూర్ రోడ్‌లోని హఫీజ్‌పేట ఫ్లైఓవర్‌పై భారీగా వరద నీరు చేయడంతో అధికారులు నీటిని మోటార్ల సాయంతో తోడేశారు.
బల్దియా, హైడ్రా వైఫల్యం..
గత కొద్ది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. నగర ప్రజలు నరకం చూస్తున్నారు. గంటల తరబడి వాహనదారులు రోడ్లపై చిక్కుకుని విలవిలలాడుతున్నారు. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. కానీ బల్దియా, హైడ్రా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోకపోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు.
మేమేం చేయలేం..
ఐటీ కారిడార్‌లో మూడు గంటల పాటు భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో ఓ వాహనదారుడు పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి క్లియర్ చేయాల్సిందిగా కోరారు. వర్షం వస్తుంది కాబట్టే ట్రాఫిక్ జామ్ అయింది.. దానికి మేమేం చేయలేమంటూ సమాధానమివ్వడం గమనార్హం. హిమాయత్‌సాగర్ రిజర్వాయర్‌లో అధికారులు గురువారం రాత్రి ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం శుక్ర, శని (నేడు, రేపు) రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు.
వర్ష సూచన
రాష్ట్రంపై రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.